వారిద్దరూ ఇష్టపడ్డారు.. పెద్దలు వారి ప్రేమకు అడ్డు పడ్డారు..
పూడూరు: వారిద్దరూ ఇష్టపడ్డారు.. పెద్దలు వారి ప్రేమకు అడ్డు పడ్డారు.. ఇక గత్యంతరం లేదని యువకుడు ప్రాణాలు తీసుకోగా.. ప్రియుడు లేని జీవితం తనకు వద్దంటూ యువతి కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద సంఘటన మండల పరిధిలోని చన్గోముల్ గ్రామంలో చోటచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చన్గొముల్‌కు చెందిన గొళ్ల పురేందర్(21), అనురాధ(19)లు పక్కపక్క ఇళ్లలోనే నివసిస్తున్నారు. వీరిద్దరూ ఒకే వర్గానికి చెందిన వారు కూడా. ఈక్రమంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. రెండేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో తరచూ గొడవలు జరగడం ప్రారంభమైంది.
దీంతో యువకుడు నగరానికి వెళ్లి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.. యువతి వికారాబాద్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. పురేందర్ అప్పుడప్పుడు గ్రామానికి వచ్చేవాడు. ఈక్రమంలో అతడు ఆదివారం చన్గోముల్‌కు రాగా అనురాధ అతణ్ని కలుసుకుంది. ఈ విషయం అమ్మాయి కుటుంబ సభ్యులు గమనించడంతో మళ్లీ గొడవ జరిగింది.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పురేందర్ సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం పురేందర్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో యువతిని ఇంట్లో వేసి ఆమె బంధువులు తాళం వేశారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత తలుపులు తెరిచి చూసే సరికి అనురాధ కూడా ఉరివేసుకొని బలవ్మరణానికి పాల్పడింది. ప్రేమికుల ఆత్మహత్యతో గ్రామంలో వి షాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయమై పో లీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిసింది.