మా ప్లాట్‌ ఏ జోన్‌లో ఉందో చెప్పండి.. | LUC Applications To HMDA In Online | Sakshi
Sakshi News home page

మా ప్లాట్‌ ఏ జోన్‌లో ఉందో చెప్పండి..

Published Mon, Jul 30 2018 12:06 PM | Last Updated on Tue, Sep 4 2018 5:53 PM

LUC Applications To HMDA In Online - Sakshi

సాక్షి, సిటీబ్యూరో:  ‘ల్యాండ్‌ యూజ్‌ సర్టిఫికెట్‌ (ఎల్‌యూసీ)...భూమి యజమాన్య హక్కులున్న వారికి ఇది ఎంతో ఉపయోగం...ఆ భూమిలో భవన నిర్మాణానికి అనుమతి కావాలన్నా ఇది తప్పనిసరి. బ్యాంక్‌ రుణాలకు ఉపయోగపడుతుంది అవసర సమయంలో ఇతరులకు విక్రయించేటప్పుడు ఈ సర్టిఫికెట్‌ ఉంటే ఈజీగా అమ్మేయొచ్చు. కొనుగోలుదారుడు కూడా నమ్మకంతో ముందుకొస్తాడు’...గతంలో  ఎల్‌యూసీ సర్టిఫికెట్‌ వచ్చేందుకు ఏళ్ల తరబడి తార్నాకలోని హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వచ్చేది. వీరి వెతలు హెచ్‌ఎండీఏ కమిషనర్‌ టి.చిరంజీవులు దృష్టికి రావడంతో డెవలప్‌మెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (డీపీఎంఎస్‌) ద్వారా ఎల్‌యూసీ ఆన్‌లైన్‌ సేవలను గత ఏడాది జూలైలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా హెచ్‌ఎండీఏకు నెలకు దాదాపు 200కుపైగా ఎల్‌యూసీ దరఖాస్తులు వస్తున్నాయి. ఎల్‌యూసీ కోసం తార్నాకలోని హెచ్‌ఎండీఏ కార్యాలయానికి రాకుండానే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని పక్షం రోజుల్లోనే  సర్టిఫికెట్‌ అందుకుంటున్నారు. 

ఆన్‌లైన్‌ డీపీఎంఎస్‌లోనే...
http://www.hmda.gov.in వెబ్‌సైట్‌లో కుడివైపున ఉండే ‘ఆన్‌లైన్‌ డీపీఎంఎస్‌’ అప్షన్‌ను క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత కనిపించే ‘అప్లయ్‌ ఫర్‌ ల్యాండ్‌ యూజ్‌ సర్టిఫికెట్‌’ను క్లిక్‌ చేస్తే ‘అప్లయ్‌ ఫర్‌ న్యూ’ అనే అప్షన్‌ కనిపిస్తుంది. అందులోకి వెళ్లి మండలం, విలేజ్, సర్వేనంబర్లు, సేల్‌డీడ్, ఓనర్‌షిప్‌ యజమాన్య పత్రాలు ఆప్‌లోడ్‌ చేయాలి. ఆ తర్వాత ఆ సర్వే నంబర్లను మాస్టర్‌ప్లాన్‌లో అధికారులు పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయి కెళ్లి ఆ భూమి వివరాలు తెలుసుకుంటారు. ఈ ప్రక్రియ 15 రోజుల పాటు సాగుతుంది. ఆ తర్వాత ఆ భూమి ఏ యూజ్‌లో ఉందో తెలుపుతూ ల్యాండ్‌ యూజ్‌ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. 

పక్కా పారదర్శకంగా...
ప్రస్తుత రోజుల్లో భూమి కొందామంటే భయం.. అది సక్రమమా, అక్రమమా అని. తమ సొంతింటి కలను సాకారం చేసుకునే క్రమంలో చాలా మంది ఎన్నో ప్రాంతాల్లో తిరిగి ఎక్కడో ఒక చోట బోల్తా పడుతుంటారు. తీరా ఆది మాస్టర్‌ప్లాన్‌లో గ్రీన్‌జోన్‌లో ఉందని తెలియడంతో వారి బాధలు వర్ణనాతీతం...ఒక లే అవుట్‌ను డెవలప్‌చేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేద్దామనుకున్న వ్యాపారులు కూడా రియల్‌ దందాలో ఆ భూమి గురించి పూర్తి వివరాలు తెలియక కొని మోసపోతున్నవారు ఎందరో ఉన్నారు. ఇటువంటి వాటికి చెక్‌పెట్టేందుకు కొన్ని ఏళ్ల క్రితం తీసుకొచ్చిన ఎల్‌యూసీ దరఖాస్తు, జారీ మాన్యువల్‌గా సాగుతుండటం,
అది కూడా నెలల పాటు సమయం తీసుకుంటుండడంతో ప్రయోజనం లేకుండా పోతోంది. దీంతో బిల్డింగ్‌ పర్మిషన్‌ కూడా ఆలస్యమవుతోంది. సొంతిల్లు సకాలంలో నిర్మించుకోలేక అద్దె ఇండ్లలోనే కాలం వెళ్లదీస్తున్నవారు ఉన్నారు. కొంత మంది ఎల్‌యూసీ వచ్చేందుకు చాలా సమయం తీసుకుంటుండడంతో ముందే ఇల్లు కట్టేసి తీరా అది గ్రీన్‌జోన్‌లో ఉండటంతో అధికారులు కూల్చివేయడంతో లబోదిబోమంటున్న సంఘటనలు అనేకం. వీటన్నింటికి చెక్‌ పెట్టడంతో పాటు ఎల్‌యూసీ దరఖాస్తుదారుడికి సకాలంలో అందేలా  అది కూడా 15 రోజుల్లో వచ్చేలా కమిషనర్‌ చిరంజీవులు చొరవ తీసుకున్నారు. దీంతో పాటు వాటర్, కరెంట్‌ కనెక్షన్‌ కోసం ఉపయోగపడే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను కూడా ఆన్‌లైన్‌లోనే జారీ చేస్తున్నారు.

పక్షం రోజుల్లోనే అనుమతి...
ఎల్‌యూసీ దరఖాస్తుదారులు హెచ్‌ఎండీఏ కార్యాలయం చుట్టూ తిరిగే తిప్పలు తప్పాయి. దరఖాస్తుదారుడు అప్లయి చేసిన దగ్గరి నుంచి సర్టిఫికెట్‌ జారీ చేసే వరకు పారదర్శకంగా ఉంటుంది. ఎల్‌యూసీ కోసం దరఖాస్తు చేసిన  భూమి సర్వే నంబర్లు హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో  రెసిడెన్షియల్, కమర్షియల్,. ఇండస్ట్రియల్, కన్జర్వేషన్, ఇన్‌స్టిట్యూషన్‌  గ్రీన్‌జోన్‌..ఇలా ఏ పరిధిలో ఉందో తెలుసుకోవచ్చు. క్షేత్రస్థాయిలో అన్ని తెలుసుకున్నాక ఆన్‌లైన్‌ ద్వారానే పక్షం రోజుల్లోనే ఎల్‌యూసీ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. దీనివల్ల బిల్డింగ్‌ పర్మిషన్‌ తొందరగా వచ్చేస్తుంది. బ్యాంక్‌ నుంచి రుణాలు పొందడం కూడా సులభమవుతుంది.  
–టి.చిరంజీవులు, హెచ్‌ఎండీఏ కమిషనర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement