సాక్షి, హైదరాబాద్: తండ్రి చేతిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మాధవి(22)ని వైద్యులు బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నట్లు ప్రకటించారు. ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన సందీప్(24), బోరబండ వినాయకనగర్‌కు చెందిన మాధవి(22) ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో మాధవి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో వారు తల్లిదండ్రులకు చెప్పకుండా సెప్టెంబర్ 12న అల్వాల్ ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. పోలీసుల కౌన్సెలింగ్ తర్వాత మాధవి తండ్రి మనోహరాచారి కొత్త దంపతులకు బట్టలు కొనిస్తానని, ఎర్రగడ్డకు రావాలని ఆహ్వానించడంతో సెప్టెంబర్ 19న వారిద్దరూ అక్కడికి చేరుకున్నారు. అక్కడ మనోహరాచారి కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన మాధవిని యశోద ఆస్పత్రికి తరలించారు. తెగిపోయిన చేయి సహా చెవి, మెడ భాగంలోని నరాలు, కండరాలను వైద్యులు అతికించారు. చికిత్స పూర్తయిన తర్వాత తాజాగా డిశ్చార్జి చేశారు. కాగా, ఇప్పటివరకు మాధవిని చూసేందుకు తల్లిదండ్రుల తరఫు బంధువులెవరూ రాలేదు.
నమ్మకంతోనే పెళ్లి చేసుకున్నా: మాధవి, బాధితురాలు
సందీప్‌పై పూర్తి నమ్మకం ఏర్పడిన తర్వాతే ఆయన్ను పెళ్లి చేసుకోవాలని భావించాను. ఇదే విషయాన్ని మా ఇంట్లో కూడా చెప్పాను. అయితే, వారు అంగీకరించకపోవడం వల్లే ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నాం. దాడి తర్వాత చాలా అవస్థ పడ్డాను. నాలాంటి పరిస్థితి మరే ప్రేమికురాలు ఎదుర్కోకూడదు. దాడి చేసిన వారెవరైనా సరే శిక్ష అనుభవించి తీరాల్సిందే.
నమ్మించి మోసం చేశాడు: సందీప్, మాధవి భర్త
పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి రావాలని మనోహరాచారి ఆహ్వానించాడు. రిసెప్షన్ చేస్తామని చెప్పాడు. కొత్త బట్టలు కొనిస్తానని నమ్మించాడు. తీరా వచ్చిన తర్వాత దాడికి పాల్పడ్డాడు. ప్రాణాపాయస్థితిలో వచ్చిన నా భార్యను యశోద ఆస్పత్రి ఆదుకుంది. వైద్యఖర్చులను భరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment