
హైదరాబాద్: బంధువులు, కుటుంబ సభ్యుల ఒత్తిళ్ల కారణంగా ఆవేశానికి లోనై తన కుమార్తె మాధవి, అల్లుడు సందీప్‌పై దాడి చేశానని నిందితుడు మనోహరాచారి పోలీసుల విచారణలో వెల్లడించాడు. మనోహరాచారి గత నెల 19న ఎర్రగడ్డలో అల్లుడు, కూతురిపై దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి లోతైన విచారణ జరిపేందుకు ఎస్‌ఆర్ నగర్ పోలీసులు నిందితుడిని మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. విచారణలో ఘటనకు దారితీసిన వివరాలను మనోహరాచారి వెల్లడించినట్లు సమాచారం. కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో దాడికి పాల్పడలేదని, కుటుంబ సభ్యులు, బంధువుల సూటి పోటి మాటలతో ఆవేశానికి లోనయ్యానని తెలిపాడు.
మాధవి, సందీప్‌ల ప్రేమ విషయం తనకు తెలియదని, ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నాక పోలీసుల ద్వారా తనకు పిలుపు వచ్చిందని చెప్పాడు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చాక వారిపై ఉన్న కోపం పోయిందని, రెండు సార్లు సందీప్ ఇంటికి వెళ్లి ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చానని వెల్లడించాడు. తరువాత బంధువులు, కుటుంబ సభ్యులు తనను రెచ్చగొట్టారని విచారణలో పేర్కొన్నాడు. కూతురు ప్రేమ వివాహం చేసుకుని వస్తే ఊరుకుంటావా, పౌరుషం లేదా అంటూ బంధువులు పదే పదే అనడంతో ఏమి చేయాలో తెలియక వారం రోజుల పాటు అన్నపానీయాలు మాని మద్యానికి అలవాటు పడ్డానని చెప్పాడు.
ప్రణయ్ హత్య ఘటనతో ఆగ్రహం..
సందీప్‌ను వదిలిపెట్టి ఇంటికి రావాలని పదే పదే కోరినా మాధవి రాలేదని, ఇదే సమయంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య సంఘటన తనలో మరింత ఆగ్రహన్ని తెప్పించిందని మనోహరాచారి విచారణలో అంగీకరించాడు. అయితే ప్రణయ్‌ను హత్య చేసిన విధంగా కాకుండా తన కూతురు మాధవినే హతమార్చాలని నిర్ణయానికి వచ్చానని చెప్పాడు. 19న ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి నేరుగా అమీర్‌పేటలోని వైన్స్‌షాపుకు వెళ్లి బాగా మద్యం సేవించి మాధవికి ఫోన్ చేసి బట్టలు ఇప్పిస్తానని చెప్పి ఒక్కదానివే ఎర్రగడ్డకు రావాలని తెలిపానన్నాడు. మార్గ మధ్యంలో ప్రైమ్ ఆసుపత్రి సమీపంలో కొబ్బరి బొండాల బండి వద్దకు వెళ్లి కత్తిని దొంగిలించి ఎర్రగడ్డకు వచ్చానని తెలిపాడు. అప్పటికే సందీప్, మాధవిలు అక్కడకు కలిసి రావడంతో ముందుగా సందీప్‌పై దాడిచేస్తే పారిపోతాడని భావించి అతడిపై కత్తితో దాడి చేశానని పేర్కొన్నాడు. మద్యం మత్తులో కసాయిగా మారి అల్లారు ముద్దుగా కనిపెంచిన కుమార్తెని చేతులతోనే నరికేశానని విచారణలో తెలిపాడు.