‘కొట్టినా, తిట్టినా..మధుకర్ అంటే చాలా ఇష్టం’
భువనగిరి: అమెరికాలో వారం రోజుల కింద ఆత్మహత్య చేసుకున్న ఎన్నారై మధుకర్‌రెడ్డి ఆత్మహత్య వివాదంలో అతడి భార్య స్వాతి స్పందించారు. తనపై మధుకర్ రెడ్డి తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. భార్యాభర్తల మధ్య జరిగిన ఫోన్‌కాల్స్ రికార్డులను స్వాతి బుధవారం మీడియాకు వివరించారు. మధుకర్ రెడ్డి చివరిసారి మాట్లాడిన ఫోన్‌కాల్ రికార్డును స్వాతి..మీడియాకు వినిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ మధ్య గొడవలు చాలా చిన్నవని, తన భర్త ఎప్పుడూ కొట్టడం, తిట్టడం చేసేవాడని...అయినా మధుకర్‌రెడ్డి అంటే తనకు చాలా ఇష్టమన్నారు. తన భర్త పెళ్లయిన నాటి నుంచే డిప్రెషన్‌లో ఉన్నాడని, భార్యభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేకున్నా, మధు బంధువులే అతడిని తప్పుదోవ పట్టించారన్నారు.
కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న గొడవలు తప్పా మేమిద్దరం అన్యోన్యంగానే ఉండేవాళ్లమని అయితే ఆస్తుల కోసం మధుకర్‌రెడ్డి తల్లిదండ్రులు తమ మధ్య సమస్యలు సృష్టించారని స్వాతి ఆరోపించారు. గత రెండు నెలల నుంచి మధుకర్ రెడ్డి తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లాడని స్వాతి అన్నారు. డిప్రెషన్ వల్లే తనను కొట్టి ఆ తరువాత క్షమాపణ కోరే వాడని తెలిపారు. మధుకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోకుండా తానే వేధింపులకు పాల్పడ్డానని అతని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రవీందర్ రెడ్డి అనే వ్యక్తి తమని చాలా డిస్టర్బ్ చేశాడని, తన గురించి అతడు ఇక్కడ చెడుగా చెప్పేవాడని అన్నారు. ఈ విషయం తెలిసి మధు వారితో మాట్లాడటం మానేశారని స్వాతి తెలిపారు. మధు వాళ్ల అన్నకు రూ.40 లక్షలు, అక్కకు రూ.30 లక్షలు ఇచ్చారని, ఆర్థిక సమస్యలు కూడా మధును వేధించాయన్నారు. గత రెండు వారాలుగా మధు తనపై చాలా ప్రేమ చూపించాడని, చనిపోయే రోజు మధ్యాహ్నం 2 గంటలకు తాను ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. సాయంత్రం 5.30 గంటలకు ఇంటికి వచ్చేసరకి మధు ఉరి వేసుకుని ఉన్నాడన్నారు. తన భర్త మృతదేహాన్ని కూడా చూడనివ్వలేదని, తనపై భర్త కుటుంబసభ్యులు దాడికి పాల్పడ్డారన్నారు. తనకు రక్షణ లేదని, తన పాపకు ఏమవుతుందోననే భయంగా ఉందన్నారు. తనతో పాటు, తన కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలని స్వాతి కోరారు.
ఉద్యోగం పోతుందనే భయం మధుకు మొదలైందని తెలిపింది. డిప్రెషన్‌లో ఉన్న తన భర్త ట్రీట్‌మెంట్ తీసుకున్నట్లు చెప్పింది. కొంతకాలంగా తన భర్త మూడీగా ఉన్నాడని, ఈ విషయాన్ని తన అత్తమామలకు కూడా చెప్పినట్లు తెలిపింది. మానసిక ఒత్తిడి, ఉద్యోగ భయం, కుటుంబ సభ్యుల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని స్వాతి వెల్లడించింది. గతంలో మధుకర్ రెడ్డి పంపిన ఈ మెయిల్‌ను ఆమె మీడియాకు చూపించింది. కాగా భర్త భౌతికకాయాన్ని చూసేందుకు వెళ్లిన స్వాతిపై ఆమె అత్తమామలు, బంధువులు దాడి చేసిన విషయం తెలిసిందే.