భువనగిరి: అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మధుకర్‌రెడ్డి అంత్యక్రియల సందర్భంగా మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యాదాద్రి జిల్లా భువనగిరిలో మధుకర్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన అతని భార్య స్వాతిపై భర్త తరఫు బంధువులు దాడి చేశారు. మధుకర్ మృతికి భార్యే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడిని అన్యాయంగా పొట్టనపెట్టుకుందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్వాతి తనకు ప్రాణహాని ఉందంటూ తల్లిదండ్రులతో కలిసి భువనగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
భర్త మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన తన కుమార్తెపై దాడి చేయడం సరికాదని స్వాతి తల్లి అన్నారు. తన కూతురు గత ఆరేళ్లుగా నరకం అనుభవిస్తోందని ఆమె ఆరోపించారు. పాప కోసం సర్దుకుపోవాలంటూ ఇన్ని రోజులు తన కూతురికి చెప్పుకుంటూ వచ్చానన్నారు. అయితే అల్లుడి ఆత్మహత్యతో గత ఆరు రోజులుగా తమ కూతురు గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనవసరంగా ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవద్దని స్వాతి తల్లి హితవు పలికారు. తన అల్లుడిది హత్యో, ఆత్మహత్యో త్వరలోనే తేలుతుందని, తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు.
కాగా భువనగిరి మండలం మద్దెలగూడేనికి చెందిన స్వాతితో మధుకర్‌రెడ్డి వివాహం జరిగింది. కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న వీరి దాంపత్య జీవితం కొంతకాలం పాటు సాఫీగా సాగింది. అనంతరం వీరికి శర్మిష్ట జన్మించింది. ప్రస్తుతం పాపకు నాలుగు సంవత్సరాలు. కొంత కాలంగా దంపతుల మధ్య కలహాలు ఏర్పడినట్లు సమాచారం. కుటుంబ కలహాలతోనే మనస్తాపం చెందిన మధుకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.