సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఏ4 మద్యంషాపుల పక్కన నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్న పర్మిట్ రూములను తనిఖీ చేయాలని ఎక్సైజ్ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. మద్యం షాపుల యజమానులు తమ షాపుల పక్కనే పర్మిట్ రూమ్‌లు ఏర్పాట్లు చేసి అందులో ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నా అధికారులు వారిపై చర్యలు తీసుకోవడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన ఎస్.రాములు నాయక్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది. ఏయే ప్రాంతాల్లోని పర్మిట్ రూమ్‌లలో తనిఖీలు చేయాలో అధికారుల నిర్ణయానికి వదిలేసింది.
ఒక్కో పర్మిట్ రూమ్ ఎంత ఉంది? నిబంధనల మేరకే ఆ పర్మిట్ రూమ్ సైజు ఉందా? నిబంధనలకు లోబడే పర్మిట్ రూమ్‌ను నిర్వహిస్తున్నారా? ఆహార పదార్థాల సరఫరా నిబంధనల్లో ఏమైనా మినహాయింపులు ఉన్నాయా? తదితర వివరాలతో నివేదికను తమ ముందుంచాలని కమిషనర్‌ను ఆదేశించింది. విచారణను జనవరి 1కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌ల ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పర్మిట్ రూమ్‌ల వల్ల ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. పర్మిట్ రూమ్‌లలో ఆహార పదార్థాల సరఫరాకు నిబంధనలు అంగీకరించవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment