ఫాంహౌస్‌కు సరే... మా పొలాలకు నీళ్లొద్దా?
- ఎల్లంపల్లి మిగులు భూములకు నీళ్లివ్వాల్సిందే
- శాప్ మాజీ చైర్మన్ మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్
సాక్షి, పెద్దపల్లి: ఎర్రవెల్లిలోని సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కు ఎల్లంపల్లి నుంచి నీళ్లు చేరుతున్నాయని, ప్రాజెక్ట్ కోసం భూములు త్యాగం చేసిన రైతుల మిగులు భూములు మాత్రం ఎండుతున్నాయని శాప్ మాజీ చైర్మన్ మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ మండి పడ్డారు. ఎల్లంపల్లి భూనిర్వాసితుల మిగులు భూములకు సాగునీళ్లందే వరకు పోరాటాన్ని ఆపేది లేదని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్వాసితుల మిగులు భూములకు సాగు నీరివ్వాలని డిమాండ్ చేస్తూ మక్కాన్‌సింగ్ పాదయాత్ర చేపట్టారు.
రామగుండం నియోజకవర్గంలోని 16 గ్రామాల గుండా 35 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగింది. శుక్రవారం పాద యాత్ర ముగింపు సందర్భంగా పెద్దపల్లికి భారీ ర్యాలీతో వచ్చిన ఆయన జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎస్.ప్రభాకర్‌రెడ్డికి వినతిపత్రం అందచేశారు. దివంగత ముఖ్య మంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి దూరదృష్టితోనే ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారని మక్కాన్‌సింగ్ అన్నారు. తమ విజ్ఞప్తి మేరకు వైఎస్సార్ ఆదేశంతో స్థానికంగా సాగు, తాగునీరందించేందుకు సుమారు రూ.80 కోట్లతో బండలవాగు, బుగ్గ వద్ద చెక్‌డ్యాం నిర్మించాలని నిర్ణయించారన్నారు.