మల్కాజ్‌గిరి కోర్టు సంచలన తీర్పు | Malkajgiri Court Sensational Judgement | Sakshi
Sakshi News home page

తల్లిని వేధించిన కొడుకుకి జైలు శిక్ష

Published Mon, Jul 22 2019 6:29 PM | Last Updated on Mon, Jul 22 2019 6:40 PM

Malkajgiri Court Sensational Judgement - Sakshi

హైదరాబాద్‌ :  తల్లిదండ్రులను వేధించే పిలల్లకు గుణపాఠంగా మల్కాజ్‌గిరి కోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. తండ్రి మరణాంతరం తల్లి ఆలనపాలన చూడాల్సిన కొడుకే కర్కశంగా మారడంతో ఆ అభాగ్యురాలు పోలీసులు, కోర్టును ఆశ్రయించింది. దీనిపై నాలుగేళ్లుగా విచారణ జరిపిన కోర్టు ఇవాళ తుదితీర్పును వెలువరించింది. ఆస్తి కోసం తల్లిని వేధించిన కొడుకుతో పాటు కోడలికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు పదివేల జరిమానా విధించింది.

నేరేడ్‌మెట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిల్ కాలనీలో నివాసం ఉండే ప్రేమ కుమారి (70)కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 2013లో భర్త చనిపోయాడు. భర్త చనిపోకముందే పిల్లల వివాహాలు జరిపించాడు. ఎవరికి వారు వేరుగా ఉంటున్నారు. భర్త చనిపోవడంతో పెద్ద కుమారుడు నుంచి తల్లికి వేధింపులు మొదలయ్యాయి. ముషీరాబాద్ లో నివాసం ఉండే పెద్ద కుమారుడు అమిత్ కుమార్ తన భార్యతో సహా తల్లి ఉండే ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించమే కాకుండా ఆమెను బయటకు పంపేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని భార్యతో కలిసి క్రూరంగా హింసించడం మొదలుపెట్టాడు. ఇది భరించలేని తల్లి... 2015లో  పోలీసులను ఆశ్రయించగా అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగేళ్లుగా విచారణ జరిగిన ఈ కేసు తుదితీర్పు నేడు(సోమవారం) వెలువడింది. పెద్ద కుమారుడు అమిత్ కుమార్, కోడలు శోభిత లావణ్యలకు రెండేళ్ల జైలుశిక్షతో పాటు చేరో పదివేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుపై పలువురు హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ తీర్పుతోనైనా సమాజంలో మార్పురావాలని వారు అభిప్రాయపడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement