సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతగా ఖమ్మం జిలా మధిర శాసన సభ్యుడు మల్లు భట్టివిక్రమార్క నియమితుల య్యారు. ఈ పదవి కోసం పార్టీలోని సీనియర్ నేతలు తీవ్రంగా పోటీపడినప్పటికీ.. భట్టి వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఆయన్ను సీఎల్పీ నేతగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్నికల సమయంలో పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా పనిచేసిన భట్టి వైపే రాహుల్ మొగ్గుచూపారు.
సామాజిక సమీకరణాల కోణంలోనూ దళిత వర్గాలకు చెందిన భట్టిని ప్రతిపక్ష నాయకుడిగా నియమిస్తే బాగుంటుం దనే ఆలోచనతో రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రచార కమిటీ చైర్మన్‌ను సీఎల్పీ నేతగా ఎన్నుకునే ఆనవాయితీ కాంగ్రెస్‌కు ఉంది. అయితే.. ఈసారి సీఎల్పీ నేత పదవి కోసం చాలా మంది నేతలు ప్రయత్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు,సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల పేర్లు వినిపించాయి. అయితే, అందరు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం అన్ని కోణాల్లో ఆలోచించి భట్టిని సీఎల్పీ నాయకుడిగా నియమించింది.
పార్టీ బాధ్యతల్లో ఉత్తమ్
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ను అదే పదవిలో కొనసాగించి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టాలని అధిష్టానం ఆలోచించింది. చివరి నిమిషంలో ఉత్తమ్ కూడా భట్టి వైపే మొగ్గుచూపారని పార్టీ వర్గాలంటున్నాయి. మహిళల కోటాలో సబితా ఇంద్రారెడ్డి పేరును కూడా తీవ్రంగానే పరిశీలించిన అధిష్టానం.. సీఎల్పీ, పీసీసీ పదవులు రెండూ ఒకే సామాజిక వర్గానికి కేటాయించడం సరైంది కాదనే అభిప్రాయంతో ఆమె పేరును కూడా పక్కనపెట్టింది. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు పేరు ఈ రేసులో వినిపించినా ఆయన ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవివైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విషయంలో ఎమ్మెల్యేల మద్దతు కొంత లభించినా.. మొదటిసారి ఎమ్మెల్యే కావడం, సామాజిక వర్గం కారణంగా ఆయన వైపు కూడా అధిష్టానం మొగ్గు చూపలేదు. భట్టిని సీఎల్పీ నేతగా నియమించడం ద్వారా.. దళితుడిని సీఎంను చేస్తానని కేసీఆర్ చేయలేదని, తాము దళిత నాయకుడిని తమ సభానాయకుడిగా ఎన్నుకున్నామన్న సందేశం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి పట్టం కట్టిన ఖమ్మం జిల్లా ప్రజల నిర్ణయాన్ని గౌరవించినట్టు ఉంటుందని కూడా అధిష్టానం ఆలోచించి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. అన్ని అంశాలు కలిసిరావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా మల్లు భట్టివిక్రమార్క నియమితులయ్యారు.
ఎమ్మెల్సీగా, డిప్యూటీ స్పీకర్‌గా
గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన మల్లు అనంత రాములు సోదరుడైన భట్టి విక్రమార్క 1961లో జన్మించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఖమ్మం జిల్లాలో పనిచేసిన ఆయన ఆంధ్రాబ్యాంక్ డైరెక్టర్‌గా 1996–2000 నామినేటెడ్ (తొలిసారి) పదవి చేపట్టారు. 1990–92 వరకు పీసీసీ కార్యవర్గ సభ్యుడిగా, 2000–03 వరకు పీసీసీ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత 2007–2009 వరకు ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన భట్టి.. 2014, 18 ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే విజయం సాధించారు. 2009లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, 2014లో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 2015లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ఐఏఎస్ అధికారి కావాలని కలలుగన్న భట్టి.. ఇంటర్వూ్య వరకు వెళ్లారు. 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో రాణిస్తున్నారు.
రాజీలేని పోరాటం చేస్తా: భట్టి
తనను సీఎల్పీ నేతగా నియమించడం పట్ల భట్టి విక్రమార్క ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణలో పార్టీకి పునర్‌వైభవం తెచ్చేలా పనిచేస్తానని, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని ‘సాక్షి’కి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment