
నిండు ప్రాణం తీశారు
పిచ్చికుక్క కరిచిందని ఆవుకు ఉరి వేశాడో రైతు. గ్రామస్తుల ఒత్తిడి మేరకే అతను ఈ దారుణానికి ఒడిగట్టాడు.
ధారూరు: పిచ్చికుక్క కరిచిందని ఆవుకు ఉరి వేశాడో రైతు. గ్రామస్తుల ఒత్తిడి మేరకే అతను ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ధారూరు మండలంలో మంగళవారం వెలుగుచూసింది. నాగారానికి చెందిన శ్రీజంగపు అంజిలయ్య ఆవును మూడు రోజుల క్రితం ఓ పిచ్చికుక్క కరిచింది. అప్పటి నుంచి నుంచి ఆవు పిచ్చిగా ప్రవర్తిస్తోంది. ఎవరు కనిపించినా కుమ్మేందుకు దూసుకెళుతోంది. దానికి వైద్యం చేయడానికి పశువుల ఆస్పత్రిలో సిబ్బంది కూడా లేరు.
ఈ ఆవు వల్ల ప్రమాదం పొంచి ఉండడంతో సోమవారం దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కాని అది దొరకలేదు. దీంతో దాన్ని చంపేయాలని గ్రామస్తులంతా అంజిలయ్యపై ఒత్తిడి తెచ్చారు. చేసేది లేక.. గ్రామానికి కొద్దిదూరంలో ఉన్న చింతచెట్టు వద్దకు ఆవు వచ్చేలా చేసి దానికి ఉరివేసి చంపారు. ఈ ఫొటో జెడ్పీ చైర్‌పర్సన్‌కు ఒకరు వాట్సప్‌లో పంపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా పిచ్చికుక్క కరిచిందని.. ఆవును ఉరివేసి చంపడం బాధాకరమని జెడ్పీ చైర్‌పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు.