చంద్రునాయక్‌ను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న అధికారులు
మక్తల్/బిజినేపల్లి: పదమూడేళ్ల క్రితం అదృశ్యమైన మతిస్థిమితం లేని ఓ వ్యక్తి టిక్‌టాక్ సాయంతో ఇంటికి చేరుకున్నాడు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పెద్ద తండాకు చెందిన చంద్రు నాయక్ (45)కు మతిస్థిమితం సరిగా లేదు. ఈయనకు భార్య మారోనా, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. చంద్రు 2007 సంవత్సరంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్లకు చేరుకున్నాడు. అక్కడ గ్రామస్తులు చెప్పిన పని చేస్తూ వారు పెట్టింది తింటూ కాలం వెళ్లదీసేవాడు. కాగా, ఇదే గ్రామానికి చెందిన మ్యాకలి రామాంజనేయులు ఖాళీ సమయంలో సెల్‌ఫోన్‌లో తరచూ టిక్‌టాక్ షోలను చూసేవాడు. ఈ క్రమంలో మతిస్థిమితం లేని సదరు వ్యక్తి ఫొటో తీసి అందులో పెట్టాడు. దీనిని పెద్దతండా వాసులు చూసి అదృశ్యమైన చంద్రునాయక్ అని గుర్తించి, అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వివరాలు సేకరించి శుక్రవారం గుడిగండ్లకు చేరుకున్నారు. అక్కడ చంద్రుని చూసి ఉద్వేగానికి లోనయ్యారు. అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించి చంద్రును కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, తన భర్త చనిపోయాడని అనుకున్నానని భార్య మారోనా వాపోయింది.
Comments
Please login to add a commentAdd a comment