సాక్షి, పంజగుట్ట: ఎస్సీ, ఎస్టీల ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల అంశం రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు అభి వర్ణించడం దుర్మార్గమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. రిజర్వేషన్ల వ్యతిరేకులకు న్యాయవ్యవస్థ అడ్డాగా మారిందని విమర్శించారు. గతంలో ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని కూడా రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు రూపం లో ప్రయత్నం చేశారని, తీవ్రమైన ఉద్యమాలు చేస్తే వెనక్కి తగ్గారని గుర్తు చేశారు. రిజర్వేషన్ల అంశంపై హైదరాబాద్ కేంద్రంగా జాతీయ స్థాయి ఉద్యమం తీసుకువస్తా మన్నారు.
బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంద కృష్ణ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తీసేస్తే మిగిలినవి కూడా సులువుగా తీసేయవచ్చనే ఈ పథకం పన్నారని ఆరోపించారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉంటే ఈ తీర్పు వచ్చేది కాదన్నారు. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లకు పోరాటం చేస్తామన్నారు. మార్చి 8న నిర్వహించనున్న ‘సింహగర్జన’ను వాయిదా వేసినట్లు మందకృష్ణ తెలిపారు. ఈ సమావేశంలో రాములు నాయక్, మాల మహానాడు అధ్యక్షుడు జి.చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment