కేసీఆర్ మోసకారి
ఖమ్మం మామిళ్లగూడెం: అబద్ధాలాడి ఓట్లు దండుకున్న కేసీఆర్ ప్రజలను మోసగించారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వంద రోజుల్లో అభివృద్ధి చూపిస్తానని చెప్పిన కేసీఆర్ ఆ మేరకు కృషి చేయకుండా ఎదురుదాడికి దిగడం సరికాదన్నారు.
దళితుడిని ముఖ్య మంత్రి చేస్తానని చెప్పి తానే ఆ పీఠంపై కూర్చున్నారని విమర్శించారు. దళితుల మనోభావాలను ఆయన దెబ్బతీశారన్నారు. దళితుడైన రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఒళ్లు దగ్గర పెట్టుకోమంటూ హెచ్చరించడం పట్ల కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దళితుడనే ఉద్దేశంతోనే రాజయ్యను కించపర్చారని మండిపడ్డారు. నిజాం షుగర్ ప్యాక్టరీని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పనంగా తమ బంధువులకు అప్పగించారని, దానిని స్వాధీనం చేసుకుంటానని చెప్పి ఇప్పుడా ఊసెత్తకపోవడం ఏమిటని ప్రశ్నిం చారు. మందమర్రి ఓపెన్‌కాస్ట్ వల్ల తెలంగాణ శ్మాశానంగా మారిందని చెప్పిన కేసీఆర్ దానిని ఎందుకు పట్టించుకోవటం లేదన్నారు. ఐదేళ్ల్లపాలనలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చే యాలని, ముఖ్యమంత్రి హోదాలో ప్రధానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నల్లమోతు విజయరాజు మాదిగ, జిల్లా అధికార ప్రతినిధి షేక్ మదార్‌సాహెబ్, నాయకులు శ్రీనివాసచౌదరి, భవాని చౌదరి, ఎం.నర్సయ్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు క్రాంతి పాల్గొన్నారు.
వర్గీకరణ పోరు ఆగదు
వైరా: ఎస్సీ వర్గీకరణ సాధించేవరకూ తమ పోరాటం ఆగేది కాదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు. మలిదశ పోరాటానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. వైరాలోని కామిశెట్టి కల్యాణ మండపంలో శనివారం జరిగిన ఆ సంఘం జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో రెండు పర్యాయాలు ఎస్సీవర్గీకరణ సాధించుకున్నా, కొంతమంది కుట్రల వల్ల బిల్లు ఆగిపోయిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు రాజ్యాంగ బద్ధ మార్గం లేకపోవడమే కారణమన్నారు. మాదిగల తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎస్సీ వర్గీకరణ గురించి పార్లమెంట్‌లో గానీ, అసెంబ్లీలోగానీ మాట్లాడకపోవడం దారుణమన్నారు.
ఆనాడు ఎస్సీ వ ర్గీకరణకు కాంగ్రెస్ వ్యతిరేకం కావడానికి ఆపార్టీలో మాలలు అధికంగా ఉండటమే కారణమన్నారు. టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీలు వర్గీకరణకు మద్దతు తెలిపాయన్నారు. ఆ మద్దతుతోనే ప్రస్తుత తెలంగాణ, ఆంధ్ర ముఖ్య మంత్రులు కేసీఆర్, చంద్రబాబు ప్రధాని వద్దకు వెళ్లి వర్గీకరణ గురించి మాట్లాడాలన్నారు. ఎమ్మార్పీఎస్ ను బలహీనం చేయడానికి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. అందులో భాగంగానే టీఎమ్మార్పీఎస్ పేరుతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేయించారన్నారు. ఆయన ఆటలు ఇక సాగవన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నల్లమోతు విజయ్‌రాజు మాదిగ, ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ, షేక్ మదార్ సాహెబ్, వంగూరి ఆనందరావు, గుండెపాక నరసయ్య, సామినేని భవానీ చౌదరి, వెంకటేశ్వరరావు, ఈదయ్య, నాగభూషణం, యశోద, కృష్ణ, బాబూరావు,అఫ్జల్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.