
కరోనా విజృంభించడంతో భారతప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించింది. మొదట ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ విధించినప్పటికి తరువాత దానిని మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధానిమోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అనేక మంది నిరుపేదలు, రోజువారీ కూలీలు, దినసరి కూలీలు ఉపాధి కోల్పొయారు. రోజుకు ఒక్కపూట కూడా ఆహారం దొరకక అలమటిస్తోన్నారు. సాయం అందించే వారి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అటువంటి వారికి ప్రభుత్వాలు సాయం చేస్తున్నా అది కొందరికే సరిపోతుంది. అందుకే అటువంటి వారిని ఆదుకొని ఆహారాన్ని అందించడానికి చాలా స్వచ్ఛంధ సంస్ధలతో పాటు సామాన్యులు సైతం ముందుకు వస్తున్నారు. (కష్టంలో తోడుగా కామన్మ్యాన్)
నల్గొండజిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామంలో పేదలకు కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిడమనూరు ఎంపీపీ బొల్లం జయమ్మ ప్రారంభించగా , తాటి సత్యపాల్, మాజీ సర్ఫంచ్ రాము అంజయ్య యాదవ్. సలీం పాషా, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు గండికోట యాదగిరి, బొల్లం రవి పాల్గొన్నారు. దీంతో పాటు నిడమనూరు మండలం ముప్పారం గ్రామంలో కూడా బొల్లం రవి నిరుపేదలకు కూరగాయలు పంపిణీ చేసి పెద్ద మనసు చాటుకున్నారు. (సాయం అందిస్తున్న హెల్పింగ్ హాండ్స్)
రమణీయ ఎన్ క్లేవ్ ఫ్లాట్ ఓనర్స్ అసిసియేషన్ అధ్యక్షులు సునీల్ మిశ్రా,ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి, సభ్యుల ఆధ్వర్యంలో 600 మందికి పైగా వెజ్ బిర్యానీ, బటర్ మిల్క్, మంచినీళ్ళ ప్యాకెట్లు తయారుచేసి ఇస్నాపూర్. ముత్తంగి జాతీయ రహదారిపై నిరుపేదలకు పంపిణీ చేశారు. ముత్తంగి చర్చి, ఇస్నాపూర్ చౌరస్తాలో పేదల గుడిసెల వద్దకు వెళ్లి అసోసియేషన్ సభ్యులు ఆహార ప్యాకెట్లు అందజేశారు.. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు రాచప్ప, మోహనలాల్, శివారెడ్డి, నరేందర్, వీరభద్రాచారి, నర్సింహాచారి, జోసెఫ్, పాల్, సంజీవ, అభిజిత్, రవికిరణ్. సత్యనారాయణరాజు, కాలనీ యూత్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
పార్టనర్స్ ఇన్ ప్రస్పరిటి ఎన్‌జీవో సంస్థ చింతల్ పల్లిలో 500 నిత్యవసర సరుకుల కిట్లను పంపిణీ చేసి ఔదార్యాన్ని చాటుకుంది. కరోనా కష్టకాలంలో పేదలకు అండగా నిలవడానికి ఒక్కొక్క కిట్‌లో 5 కేజీల బియ్యం, ఒక కేజీ పప్పు, అర లీటరు ఆయిల్, ఐదు రకాల కూరగాయలను అందించారు. కాఫీ రైతులకు, రోజు వారి కూలీలకు సాయాన్ని అందించి చేయూతనందించారు.
మీరు కూడా మీరు చేస్తున్న సేవ కార్యక్రమాలను సాక్షి.కామ్ ద్వారా నలుగురికి తెలియజేసి వారిలో స్ఫూర్తి నింపాలనుకుంటే webeditor@sakshi.com కి వివరాలు పంపించండి.