‘ఆసరా’లో వింతలెన్నో! | many wonders are in asara scheme | Sakshi
Sakshi News home page

‘ఆసరా’లో వింతలెన్నో!

Published Sat, Dec 13 2014 3:23 AM | Last Updated on Mon, Aug 20 2018 6:02 PM

many wonders are in asara scheme

‘ఆసరా’లో ఎన్నో వింతలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేదని పలువురు ఆందోళన చెందుతుండగా.. మరోవైపు ఓ యువకుడికి వితంతు పింఛన్ మంజూరు చేశారు అధికారులు. ఇక పెన్షన్ కింద ఇచ్చిన రూ. 500 నోట్లను దుకాణాల్లో తీసుకోవడం లేదని తాడ్‌బిలోలికి చెందిన పలువురు లబ్ధిదారులు ఆ నోట్లను తిరిగి ఇచ్చేశారు. బాల్కొండలో గతనెల 8వ తేదీన ఎమ్మెల్యే చేతులమీదుగా పింఛన్ అందుకున్న లింబాద్రి పేరు ప్రస్తుత జాబితాలో లేకుండాపోయింది. వివరాలిలా ఉన్నాయి.
 
పురుషుడికి వితంతు పెన్షన్..
ఎడపల్లి :  పింఛన్ జాబితాల్లో విచిత్రాలు చోటు చేసుకున్నాయి. జాన్కంపేటలో ఇలాంటిదే చోటు చేసుకుంది. పురుషుడి పేరుతో వితంతు పెన్షన్ మంజూరు కావడంతో అందరూ అవాక్కవుతున్నారు. గ్రామానికి చెందిన గద్ద విజయ్ అనే వ్యక్తి పేరు ఆసరా పింఛన్ల జాబితాలో కనిపించింది. అయితే అది వింతువుల జాబితాలో ఉంది. ఆధార్ కార్డు నంబరుతో పాటు ఇంటి నంబరు సరిగానే ఉన్నాయి. ఇలా తప్పుడు పింఛన్ మంజూరు చేసిన అధికారులు తీరుపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. అర్హులైనవారు కాళ్లరిగేలా తిరుగుతున్నా పింఛన్ ఇవ్వని అధికారులు.. ఇలా తప్పుడు పేర్లతో పింఛన్లు మంజూరు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

పింఛన్ కోసం ఆత్మహత్యాయత్నం
నిజాంసాగర్ : వికలాంగుడిగా ఉన్న తన కుమారుడికి పింఛన్ రాలేదన్న ఆవేదనతో శుక్రవారం ఓ తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలిలా ఉన్నాయి. సింగితం గ్రామానికి చెందిన పద్మ యాదగిరి కుమారుడు నర్సింగ్(10) వికలాంగుడు. పింఛన్ల జాబితాలో నర్సింగ్ పేరు లేదు. దీంతో ఆవేదన చెందిన యాదగిరి.. శుక్రవారం కిరోసిన్ డబ్బాతో గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నాడు. ఒంటిపై కిరోసిన్ చల్లుకొని నిప్పంటించుకోవడానికి యత్నించాడు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అతడిని అడ్డుకొని సముదాయించారు.
 
లింబాద్రికి పింఛన్ రాలేదు
బాల్కొండ :  గతనెల 8వ తేదీన ఎమ్మెల్యే చేతులమీదుగా పింఛన్ అందుకున్న లింబాద్రి పేరు ప్రస్తుత ఆసరా పథకం జాబితాలో లేకుండా పోయింది. జాబితాలో పేరు లేకపోవడంతో అధికారులు పింఛన్ ఇవ్వలేదు. వివరాలిలా ఉన్నాయి. ముప్కాల్ గ్రామానికి చెందిన ఈరవత్రి లింబాద్రికి చేతులు, కాళ్లు పనిచేయవు. మానసిక వైకల్యంతోనూ బాధపడుతున్నాడు. ఆయనను ఆసరా పథకానికి ఎంపిక చేసిన అధికారులు.. గతనెల 8వ తేదీన ఆసరా పథకం ప్రారంభం రోజున ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చేతుల మీదుగా పింఛన్ అందించారు.

మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశానుసారం పింఛన్ అందిస్తున్నామని ప్రకటించారు కూడా. కానీ అంతలోనే అతడి పేరు జాబితాలోంచి మాయమైంది. శుక్రవారం గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జాబితాలో పేరు లేకపోవడంతో అతడికి పింఛన్ ఇవ్వలేదు. లింబాద్రికి సదరం సర్టిఫికెట్ లేకపోవడం వల్లే పెన్షన్ రాలేదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే లింబాద్రి మానసిక వికలాంగుడు. మాటలు రావు. కాళ్లు కదలవు. తన చేతులతో ముద్దెడన్నం కూడా తినలేడు. అలాంటి వ్యక్తికి సదరం పేరుతో పింఛన్ ఇవ్వకపోవడం దారుణమని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
 
ఈ నోట్లు మాకొద్దు
రెంజల్ :  రూ. 500 నోట్లు తీసుకోవడానికి తాడ్‌బిలోలికి చెందిన పలువురు లబ్ధిదారులు తిరస్కరిస్తున్నారు. గ్రామంలో మూడు రోజులుగా పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. పింఛన్ కింద ఇచ్చిన రూ. 500 నోట్లను తీసుకుని లబ్ధిదారులు దుకాణాలకు వెళ్లగా.. వాటిని తీసుకోవడానికి దుకాణాల యజమానులు తిరస్కరిస్తున్నారు.

నోట్లు 2005 సంవత్సరానికి ముందు ముద్రించి నవని చెప్పి తిరస్కరిస్తున్నారని పలువురు లబ్ధిదారులు పేర్కొంటున్నారు. 2005కు ముందు ముద్రించిన రూ. 500 నోట్లను బ్యాంకుల్లో తిరిగి ఇచ్చేయాలని గతంలో ఆర్‌బీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. అయినా చాలా దుకాణాల్లో 2005కు ముందు ముద్రించిన రూ. 500 నోట్లను తీసుకోవడం లేదు. పింఛన్ల కింద పలువురు లబ్ధిదారులకు 2005కు ముందు ముద్రించిన నోట్లు వచ్చాయి. దుకాణాల్లో వాటిని తీసుకోకపోవడంతో లబ్ధిదారులు అధికారులను కలిసి ఆ నోట్లను మార్చుకుంటున్నారు.
 
పింఛన్ ఇక రాదేమోనని..
కోటగిరి :  ఆసరా కల్పించాల్సిన పింఛన్ ఉసురు తీస్తోంది. లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. పింఛన్ రాదేమోనన్న బెంగతో కొందరు గుండెపగిలి మరణిస్తున్నారు. చిక్కడ్‌పల్లికి చెందిన జింక పెద్దసాయిలు (68) అలాగే మరణించాడు. వివరాలిలా ఉన్నాయి. సాయిలుకు 10 గుంటల భూమి మాత్రమే ఉంది. అయితే అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తిగా నమోదయ్యాడు. దీంతో అతడి పేరు ఆసరా జాబితాలో లేకుండా పోయింది.

అధికారులు ప్రకటించిన పింఛన్ మొదటి జాబితాలో పేరు లేకపోవడంతో సాయిలు ఆందోళనకు గురయ్యాడు. ఇక తనకు పెన్షన్ రాదేమోనని బాధపడ్డాడు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు అధికారులు, సర్పంచ్ చుట్టూ తిరిగాడు. గ్రామ పంచాయతీ వద్ద కాసేపు ధర్నా చేశాడు. తనకు పింఛన్ ఇప్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకున్నాడు. రాత్రి ఇంటికి చేరి తొమ్మిది గంటలకు భోజనం చేశాడు. చాతిలో నొప్పి వస్తోందని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చేలోగానే సాయిలు మరణించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement