
సాక్షి, కొత్తగూడెం: ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం లేదని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు డిమాండ్లు సాధించుకునే వరకు సమ్మె విరమించవద్దని పిలుపునిచ్చారు. కార్మికుల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఖాళీగా ఉన్న డ్రైవర్, కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణం విడుదల చేయాలని, మోటారు వాహన పన్ను మినహాయించాలని కోరారు. సంస్థకు పూర్తి స్థాయి మేనేజింగ్ డైరెక్టర్‌ను నియమించాలని, సంస్థను అభివృద్ధి పథంలో నడపాలని కార్మికులు కోరుకుంటుంటే.. ప్రభుత్వం వారిని బెదిరింపులకు గురి చేయడం తగదని హితవు పలికారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని విమర్శిం చారు. కొత్త వాహనాల కొనుగోలు, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, ఖాళీ పోస్టుల భర్తీ వంటివి చేపట్టకుండా కార్మికులనే బదనాం చేస్తూ ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవాలని ప్రయత్నిస్తోందని జగన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment