ఎఫ్‌ఆర్‌ఎస్ సాంకేతికతతో మాస్క్‌లు ధరించని వ్యక్తులను ఇలా గుర్తిస్తారు
సాక్షి, హైదరాబాద్: మాస్క్ లేకుండా అడుగు బయటపెట్టాలంటే ఇకపై ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే.. మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారిని ఇట్టే గుర్తించి తక్షణమే చర్యలు తీసుకునేందుకు వీలుగా దేశంలోనే తొలిసారి రాజధానిలోని మూడు కమిషనరేట్లలో మాస్క్ వైలేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఎఫ్‌ఎంవీఈ) అమల్లోకి రానుంది. రాష్ట్రంలో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి అని, అవి లేకుండా బయటకు వస్తే రూ.1,000 జరిమానా అని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ సాంకేతికత సాయంతో చర్యలు చేపట్టింది. మరో మూడు రోజుల్లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో ఎఫ్‌ఎంవీఐ అందుబాటులోకి రానుంది.
ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టంలో మార్పులు
వివిధ నేరాలకు సంబంధించి వాంటెడ్‌గా ఉన్న వ్యక్తులు, నేరచరిత్ర కలిగిన పాత నేరస్తుల్ని నగరంలో పట్టుకోవడానికి రూపొందించిన ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్)లో పోలీసు విభాగం సమకాలీన అవసరాలకు తగ్గట్టు మార్పుచేర్పులు చేస్తోంది. రాజధానిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్నీ బషీర్‌బాగ్ కమిషనరేట్‌లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)లోని ఎఫ్‌ఆర్‌ఎస్ వ్యవస్థతో కూడిన సర్వర్‌కు అనుసంధానించి ఉన్నాయి.
ఇందులో 2012 నుంచి రాష్ట్రంలో అరెస్టయిన నేరగాళ్లలో కరుడుగట్టిన వారిని ఎంపిక చేసి 50వేల మంది ఫొటోలతో ఏర్పాటు చేసిన డేటాబేస్‌ను నిక్షిప్తం చేశారు. వీరిలో ఎవరైనా ఆ కెమెరాల ముందుకు వస్తే తక్షణమే సీసీసీలోని సిబ్బందిని ఎఫ్‌ఆర్‌ఎస్ అప్రమత్తం చేస్తుంది. వెంటనే ఆ వ్యక్తి ఏ ప్రాంతంలో ఉన్నాడో గుర్తించి, ఆ విషయాన్ని సమీపంలోని క్షేత్రస్థాయి పోలీసులకు చేరవేస్తుంది. ఇలా రాజధానిలోని మూడు కమిషనరేట్లలో ఇప్పటివరకు దాదాపు 150 మంది నేరగాళ్లు పట్టుబడ్డారు.
ఏ ప్రాంతంలో ఉన్నారో చూసి..
దేశంలోని మరే ఇతర కమిషనరేట్‌లోనూ లేని ఈ ఎఫ్‌ఆర్‌ఎస్ పరిజ్ఞానాన్ని ఇప్పుడు కరోనా నిరోధానికి అనువుగా మార్చి వాడుతున్నారు. ఎఫ్‌ఎంవీఈ పేరుతో రూపొందే ఈ సాఫ్ట్‌వేర్ సైతం సీసీసీలోని సర్వర్‌లో నిక్షిప్తం అవుతోంది. ఫలితంగా నగరంలో కాలినడకన సంచరించే, వివిధ క్యూలైన్లలో నిల్చునే ఏ వారిలో ఎవరైనా ఫేస్‌మాస్క్ ధరించకపోతే ఆ విషయాన్ని సమీపంలోని సీసీ కెమెరాల ద్వారా ఎఫ్‌ఎంవీఐ గుర్తించి, కంట్రోల్ రూమ్ సిబ్బందికి సమాచారం ఇస్తుంది. వెంటనే ఆ సమాచారాన్ని ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న పోలీసులకు చేరవేసి వారు ఈ ఉల్లంఘనులున్న ప్రాంతానికి వెళ్లేలా చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఎఫ్‌ఎంవీఈ పరిజ్ఞానం గరిష్టంగా మూడు రోజుల్లో అందుబాటులోకి రానుంది.
‘వాహనంపై వెళ్తున్న వాళ్ళు, పాదచారులు ఓ ప్రాంతంలో ఎక్కువ సేపు ఉండరు. వీరు మాస్క్ ధరించలేదనే విషయం ఎఫ్‌ఎంవీఈ గుర్తించినా.. దానిపై క్షేత్రస్థాయి పోలీసులకు సమాచారం అందించి అక్కడకు పంపేలోపు వారు వేరే చోటుకు వెళ్లిపోవచ్చు. అయితే దుకాణాల వద్ద, ఇతర సంస్థల వద్ద క్యూలో ఉన్న వారిపై మాత్రం కచ్చితంగా చర్య తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. భవిష్యత్తులో భౌతిక దూరం పాటించకుండా క్యూల్లో ఉన్న వారినీ గుర్తించే విధంగా ఈ టెక్నాలజీలో మార్పుచేర్పులు చేయాలని భావిస్తున్నాం’అని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment