
సాక్షి, హైదరాబాద్: కొత్త పురపాలికలకు రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రణాళికలను రెడీ చేస్తోంది. ప్రణాళికాబద్ధంగా పట్టణీకరణ జరగడానికి దోహదపడే మాస్టర్‌ప్లాన్‌లకు తుదిరూపునిస్తోంది. నూతనంగా ఏర్పడ్డ 68 పురపాలికల్లో.. 23 మున్సిపాలిటీలకు మాస్టర్‌ప్లాన్లను తయారు చేస్తోంది. ఇందులో ఇప్పటికే పెద్దపల్లి పురపాలిక ముసాయిదా మాస్టర్ ప్లాన్‌కు సర్కారు ఆమోదముద్ర వేసింది. మరో ఏడు మున్సిపాలిటీలకు సంబంధించిన ముసాయిదాలను రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనకు పురపాలక శాఖ పంపింది. పట్టణీకరణ, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రూపొందించే ఈ మాస్టర్ ప్లాన్‌లో భూ వినియోగంపై స్పష్టతనిస్తోంది.
రహదారులకు పెద్దపీట!
పట్టణాభివృద్ధికి దిక్సూచిగా చెప్పుకునే మాస్టర్‌ప్లాన్‌లో జోనల్ రెగ్యులైజేషన్‌ను విధిగా పాటించాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీల్లో అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టకుండా బ్రేక్ పడనుంది. నిర్దేశిత జోన్‌లో మాత్రమే నివాస భవనాలకు అనుమతులు జారీ చేయనున్నారు. రెసిడెన్షియల్ జోన్‌లో మాత్రమే ఈ కట్టడాలను అనుమతిస్తారు. అలాగే కమర్షియల్ జోన్‌లో వాణిజ్య కార్యకలాపాలను, రిక్రియేషన్/కన్జర్వేషన్ జోన్‌ను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. వీటితోపాటు మాస్టర్‌ప్లాన్ ఇండస్ట్రియల్ జోన్‌తోపాటు ప్రజావసరాలు, మౌలిక వసతులు, రహదారుల విస్తరణపై కూడా స్పష్టత నివ్వనున్నారు. ఈ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగానే ఆయా మున్సిపాలిటీల్లో అనుమతులు జారీ చేయనున్నారు.
ప్రభుత్వ పరిశీలనకు ఎనిమిది
ఇప్పటికే పెద్దపల్లి మాస్టర్ ప్లాన్‌కు ప్రభుత్వం ఓకే చెప్పగా.. మహబూబాబాద్, భూపాలపల్లి, అందోల్–జోగిపేట్, దేవరకొండ, కొల్లాపూర్, నాగర్‌కర్నూలు, అచ్చంపేట పురపాలికల ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌లు ప్రభుత్వ పరిశీలనకు వెళ్లాయి. ఇవిగాకుండా.. బాదేపల్లి, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, కల్వకుర్తి, కోదాడ, హుజూర్‌నగర్, ఐజ, నర్సంపేట, పరకాల, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లెందు, బెల్లంపల్లి, మణుగూరు మున్సిపాలిటీల మాస్టర్‌ప్లాన్లను డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం (డీటీసీపీ) చకచకా రూపొందిస్తోంది. వీటన్నింటికి త్వరితగతిన ఆమోదముద్ర వేయించడం ద్వారా ఆగస్టు నుంచి మనుగడలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇదిలావుండగా, ఇప్పటికే వివిధ నగరాభివృద్ధి సంస్థలు మాస్టర్‌ప్లాన్లను అమలు చేస్తున్నాయి. తాజాగా ఏర్పడ్డ మున్సిపాలిటీల్లో అధికశాతం వీటి పరిధిలోకి వస్తున్నందున అమలులో ఉన్న మాస్టర్‌ప్లాన్లే వీటికి వర్తించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment