వైకల్యానికి నేస్తం.. ఆమె ఆత్మవిశ్వాసం.. | meera shenoy special story on women empowerment | Sakshi
Sakshi News home page

వైకల్యానికి నేస్తం.. ఆమె ఆత్మవిశ్వాసం..

Published Mon, Feb 19 2018 7:42 AM | Last Updated on Mon, Feb 19 2018 7:42 AM

meera shenoy special story on women empowerment - Sakshi

మీరా షెనాయ్ , గూగుల్‌ సంస్థలో పనిచేస్తున్న అభ్యర్థులతో దర్శకుడు రాజమౌళి....

జూబ్లీహిల్స్‌: వైకల్యంతో బాధపడేవారిని చూసి కొందరు ‘అయ్యో పాపం’ అని జాలి చూపిస్తారు. మరి కొందరు తోచిన సాయం చేస్తారు. ఓ రోజు సాయం చేసినందుకే ఎంతో ఆనందపడిపోతాం.. కానీ అలాంటివారి బతుకుకు భరోసా ఇచ్చేవారు చాలా కొద్దిమందే ఉంటారు. ఈ కోవకు చెందినవారే సామాజికవేత్త, సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ మీరా షెనాయ్‌. వికలాంగులకు కొద్దిపాటి శిక్షణ ఇచ్చి వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు. ఇతరుల్లా వారూ కుటుంబానికి ఆసరాగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఆత్మవిశ్వాసంతో బతిలేలా జీవితాలను మారుస్తున్నారు. ఇందుకోసం మీరా సమాజంతో ఓ యుద్ధమే చేశారు.  

వారి జీవితాల్లో వెలుగు నింపాలని..
మన దేశంలో సుమారుగా 2 కోట్ల మంది వివిధ రకాల శారీరక వైకల్యం, అంధత్వంతో బాధపడుతున్నారని ఓ అంచనా. వారిలో కేవలం 0.1 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు, ఉపాధి పొందుతున్నారు. సరైన అవగాహన, ప్రోత్సాహం లేక చాలా మంది చీకట్లోనే మగ్గిపోవడం బాధాకరం. వీరిలో సాధ్యమైనంతమంది జీవితాల్లో వెలుగులు నింపడానికి మేం పనిచేస్తున్నాం. మా ఈ కృషికి యాక్సిస్‌ బ్యాంక్‌ ఫౌండేషన్, నాస్కామ్‌ ఫౌండేషన్, కాప్‌ జెమినీ తదితర కంపెనీలు అండగా నిలుస్తున్నాయి. 2020 నాటికి కనీసం లక్ష మందికి శిక్షణ, ఉద్యోగాలు లభించేలా ప్రణాళిక రూపొందించాం.
– మీరా షెనాయ్, ‘యూత్‌ 4 జాబ్స్‌’ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు

అభిరుచి.. సంస్థల అవసరం మేరకు..
మీరా జర్నలిజం చదువుకున్నారు. కార్పొరేట్‌ రంగంతో సంబంధాలున్నాయి. అంతేగాక ఉమ్మడి రాష్ట్రంలో ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ అండ్‌ మార్కెటింగ్‌ మిషన్‌కు సారధ్యం వహించిన అనుభవమూ ఉంది. తన అనుభవాన్ని.. పరిచయాలను వికలాంగులకు చేయూతనిచ్చేందుకు వినియోగిస్తున్నారు. ఇందుకోసం ‘యూత్‌ 4 జాబ్స్‌’ సంస్థను ఏర్పాటు చేశారు. వికలాంగులకు ఉపాధి అంశాల్లో శిక్షణనిస్తున్నారు. అంతేకాదు.. తనుకున్న కార్పొరేట్‌ పరిచయాలతో ఆయా సంస్థల్లో ఉద్యోగాలు పైతం ఇప్పిస్తున్నారు.  

శారీరక వైకల్యం ఉన్నవారు ఏ స్థితిలో ఉన్నా మీరా దారి చూపిస్తున్నారు. ఇందుకోసం  జిల్లాస్థాయి ప్రభుత్వ అ«ధికారుల సాయం సైతం తీసుకుంటున్నారు. అభ్యర్థులు కనీసం 10వ తరగతి పూర్తిచేసి 18 నుంచి 31 ఏళ్ల లోపు వయసుండి 40 శాతం శారీరక వైకల్యం, 50 శాతం మూగ, చెవుడు ఉన్నవారిని ఎంపిక చేసి

శిక్షణ ఇస్తున్నారు. పదో తరగతి కంటే తక్కువ చదువుకున్నవారి కోసం ఇటీవల ప్రత్యేక శిక్షణ బ్యాచ్‌లు ప్రారంభించారు. వీరికి స్పోకెన్‌ ఇంగ్లిష్, సాఫ్ట్‌స్కిల్స్, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తో పాటు వివిధ అంశాలపై రెండు నెలలు శిక్షణ ఉంటుంది. వారికి హాస్టల్, భోజనం వసతి కల్పిస్తారు. శిక్షణ పూర్తి చేసుకొన్నవారికి వివిధ కంపెనీల్లో వారి అభిరుచి, అవసరం బట్టి ఉపాధి చూపుతున్నారు. ఇలా హైదరాబాద్‌ సెంటర్‌లో శిక్షణ పొందినవారు గూగుల్, అమెజాన్, వెబైనర్, యాక్సిస్‌ బ్యాంక్, లైఫ్‌స్టైల్, కేఎఫ్‌సీ, వింద్యా టెక్నాలజీస్, గీతాంజలి జెమ్స్‌  తదితర కంపెనీల్లో పనిచేస్తున్నారు. వీరికి కనీస ప్రారంభ వేతనం రూ.10 వేలకు తగ్గకుండా ఉంది. 

సిటీలో మొదలై..ఆపై విస్తరించి..  
మీరా షెనాయ్‌ 2012లో ‘యూత్‌ 4 జాబ్స్‌’ సంస్ధను ఏసీ గార్డ్స్‌లో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా హాస్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇలా ప్రారంభమైన సంస్థ ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో 22 శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తోంది. సంస్థ ద్వారా ఇప్పటివరకు దాదాపు 12 వేల మంది వికలాంగులు ఉద్యోగాలు పొందారు. ఇక్కడ సుశిక్షితులైన టీచర్లతో పాటు కార్పొరేట్‌ ప్రముఖులు, సామాజికవేత్తలు, వివిధ రంగాల్లో నిష్ణాతులు స్వచ్ఛందంగా తరగతులు చెబుతుంటారు. ఈ సంస్థ రాకతో వికలాంగుల జీవితాల్లో కొత్త వెలుగు వచ్చినట్టయింది.  

నా జీవితమే మారిపోయింది..
మాది వరంగల్‌. చిన్నప్పుడే పోలియో బారిన పడ్డాను. ఆర్థిక ఇబ్బందులతో ఇంటర్‌ వరకే చదివాను. యూత్‌ 4 జాబ్స్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందాను. ప్రస్తుతం వింద్యా టెక్నాలజీస్‌లో కంప్యూటర్‌ అపరేటర్‌గా పనిచేస్తున్నా. శిక్షణ నా జీవితాన్ని మార్చేసింది. నాలో ఆత్మవిశ్వాసం నింపింది. నాకు ఉపాధి చూపించింది.      – అశ్వని, కంప్యూటర్‌ ఆపరేటర్, వింద్యా టెక్నాలజీస్‌  
 
భవిష్యత్‌ పై నమ్మకం పెరిగింది..
మాది లంగర్‌హౌజ్‌. మాటలు రావు. కనీసం వినబడదు. డిగ్రీ వరకు చదివుకున్నా. స్నేహితుల ద్వారా ఈ సంస్థలో చేరాను. గతంలో నిరాశ నిస్పృహల్లో బతికిన నాకు శిక్షణ పూర్తి పాజిటివ్‌ శక్తినిచ్చింది. త్వరలో శిక్షణ పూర్తి చేసుకొని మంచి జాబ్‌ సాధిస్తానని పూర్తి నమ్మకంతో ఉన్నాను. (ఈ వివరాలు సైగలతో చెప్పింది)     – కె.ప్రియాంక (మూగ, చెవిటి), లంగర్‌హౌజ్‌  

ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రికలు ఫోర్బ్స్, హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూ,స్టాన్‌ఫోర్డ్‌ సోషల్‌ రివ్యూ తదితర జర్నల్స్‌ యూత్‌ 4 జాబ్స్‌ చేస్తున్న సేవలను కొనియాడాయి. మీరా ఆలోచనతో వికలాంగుల జీవితాల్లో వచ్చిన మార్పును ప్రపంచానికి చాటిచెప్పాయి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement