కామారెడ్డి : కోర్టుల్లో కేసులు ఏళ్లతరబడిగా నడవడం వల్ల అటు బాధితులు, ఇటు కక్షిదారులు ఇబ్బందులు పడుతుంటారు. పెండింగ్ కేసులు పెరుగకుండా న్యాయమూర్తులు ప్రయత్నిస్తున్నా సాక్షులు, ఆధారాలను సరైన సమయంలో అందించకపోవడం, తదితర కారణాలతో కేసులు పెండింగ్ అవుతూనే ఉంటాయి. చిన్నచిన్న కేసుల్లో కూడా ఏళ్ల తరబడి తిరుగుతుంటారు. దీంతో బాధితులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు. కక్షిదారులు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. రవాణా ఖర్చులు, ఫీజులు, ఇతర ఖర్చులు పెరిగిపోయి ఇబ్బందుల పాలవుతుంటారు. అయితే ఇరువర్గాల వారు ఏదో రకంగా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం ద్వారా కేసులు తగ్గిపోతాయి.
రాజీ కుదరించి..
ఇరువర్గాలు పంతాలకు వెళ్లి ఎవరూ పరిష్కారానికి ముందుకు రాకపోవడంతో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానాలు లోక్ అదాలత్‌లను నిర్వహించి.. పైసా ఖర్చు లేకుండా, రాజీమార్గంలో బాధితులు, కక్షిదారులతో మాట్లాడి కేసులను పరిష్కరిస్తున్నాయి. ఏళ్ల నుంచి కొలిక్కిరాని ఎన్నో కేసులను లోక్ అదాలత్‌లు సులువుగా పరిష్కరిస్తున్నాయి. దీంతో చాలామంది బాధితులు లోక్ అదాలత్‌లను ఆశ్రయిస్తున్నారు.
రాష్ట్రంలోనే మొదటి స్థానం
గత ఏడాది నిర్వహించిన మెగా లోక్ అదాలత్‌ల ద్వారా కేసుల పరిష్కారంలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. గత యేడాది 129 సివిల్ కేసులు, 2834 క్రిమినల్‌కేసులు, 10,324 విద్యుత్తు కేసులు, 2963 ఇతర కేసులు పరిష్కారమయ్యాయి. ఈ ఏడాది కూడా జిల్లాలో భారీ సంఖ్యలో ఉన్న పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు గాను న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు.
నేడు దేశవ్యాప్తంగా లోక్ అదాలత్
దేశవ్యాప్తంగా శనివారం(డిసెంబర్ 6) మెగా లోక్‌అదాలత్ నిర్వహించనున్నారు. వేలాది పెండింగ్ కేసుల పరిష్కారం లక్ష్యంగా ఈ మెగా లోక్ అదాలత్‌ను చేపడుతున్నారు. అందులో భాగంగా జిల్లాలో 23 లోక్ అదాలత్‌లను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగరంతో పాటు కామారెడ్డి, ఆర్మూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భిచ్కుందలల్లో ఉన్న కోర్టుల ఆవరణల్లో లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగనున్నాయి. కామారెడ్డిలో నాలుగు బెంచ్‌లను ఏర్పాటు చేసినట్టు న్యాయమూర్తులు తెలిపారు.
ఎలాంటి కేసులు..
లోక్ అదాలత్‌లో భార్యాభర్తలకు సంబంధించిన వివాదాలు, తల్లితండ్రులకు సంబంధించిన జీవనభృతి, క్రిమినల్, సివిల్ కేసులు, మోటర్ వాహనాల కేసులు, ఎక్సైజ్ కేసులు వంటి అన్ని రకాల కేసులను పరిష్కరిస్తున్నారు. ఈ కే సుల్లో ఇరువర్గాలు రాజీ చేసుకునే వెసలుబాటు కల్పించడంతో పాటు రాజీ చేసుకున్న కేసులను అక్కడికక్కడే పరిష్కరిస్తారు. ఇలా లోక్ అదాలత్‌లో ఇచ్చిన తీర్పులపై హైకోర్టు, సుప్రీంకోర్టు వంటి కోర్టులకు అప్పీలకు పోయే అవకాశం లేదు. లోక్ అదాలత్ తీర్పు తుది తీర్పుగా భావించబడటంతో చాలామంది కక్షిదారులు లోక్ అదాలత్‌లను ఆశ్రయించి కేసులను రాజీ చేసుకుంటున్నారు. ఇటీవల బ్యాంకులు సైతం రుణాలు పొంది తిరిగి చెల్లించని వ్యక్తులకు లోక్ అదాలత్ ద్వారా నోటీసులు జారీ చేస్తూ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకుంటున్నాయి.
రాజీమార్గం..సత్వర న్యాయం
Published Sat, Dec 6 2014 4:10 AM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM
Advertisement