ఇచ్చిన నిధులు ఖర్చు చేయకపోతే ఎలా?
► సబ్‌ప్లాన్ నిధులపై అధికారులను ప్రశ్నించిన
► మంత్రి అజ్మీరా చందూలాల్
సాక్షి, హైదరాబాద్: గిరిజన తెగల ఉప ప్రణాళికకు అదనంగా నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయకపోతే ఎలా అని ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ వివిధ శాఖల అధికారులను ప్రశ్నించారు. ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను వ్యయం చేయడంలో కొన్ని విభాగాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయనే ఆరోపణలున్నాయని, భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతమైతే ఆయా శాఖల అధికారులను బాధ్యులను చేస్తామని మంత్రి హెచ్చరించారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్‌లో ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుతీరుపై జరిగిన నోడల్ ఏజెన్సీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సబ్‌ప్లాన్‌కు కేటాయిస్తున్న నిధులను ఆయా విభాగాలు సకాలంలో ఖర్చుచేస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు.