తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారు...
హైదరాబాద్ : ఎవరెన్ని కుట్రలు చేసి పాలమూరు ఎత్తిపోతల పథకం ఆగదని తెలంగాణ నీటి పారుదల శాఖమంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఎన్ని అవంతరాలు కల్పించినా యుద్ధప్రాతిపదికన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. హరీష్ రావు శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు - రంగారెడ్డి, నక్కలగండి ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు లేవన్న ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దేవినేని ఉమా వ్యాఖ్యలు అవాస్తవాలు అని హరీశ్ రావు అన్నారు.
'హైదరాబాద్లో ఉంటూ... హైదరాబాద్కు నీళ్లు వద్దా? టీడీపీ నేతలు తిన్నింటి వాసాలు లెక్కిస్తున్నారు. హెచ్ఎండీఏకు మంచినీళ్లు ఇవ్వొద్దన్న మూర్ఖులు ఎవరైనా ఉన్నారా? ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోలను మాత్రమే మా ప్రభుత్వం అమలు చేస్తోంది. పాలమూరు ఎత్తిపోతల సర్వేకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జీవో విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో విడుదల చేసిన జీవోలను మాత్రమే మేం అమలు చేస్తున్నాం. కొత్తగా మేం చేసేదీ ఏమీ లేదు.
ఎర్రబెల్లి దయకరరావుకు సిగ్గుంటే చంద్రబాబు, దేవినేని ఉమను నిలదీయాలి. ఏ అనుమతులతో పట్టిసీమ, పోలవరాన్ని ప్రారంభించారు. తెలంగాణ బిడ్డలైతే తెలంగాణ టీడీపీ నేతలు పాలమూరు ప్రాజెక్ట్పై స్పందించాలి. మంచినీళ్ల కోసం ప్రాజెక్ట్ కట్టొద్దన్న పార్టీ ఒక్క టీడీపీ మాత్రమే. ఎన్ని శాపాలు పెట్టినా అవి మాకు వరాలే. తెలంగాణ రాష్ట్రం విషయంలోనూ అపశకునం పలికారు. అవి మాకు శుభ శకునాలుగా మారాయి. మీరెన్ని కుట్రలు చేసినా పాలమూరు ఎత్తిపోతల పథకం ఆగదు. పక్కవాళ్లు చెడిపోవాలి...మేము మంచిగా ఉండాలన్నది మీ తత్వం. తెలంగాణకు పరిశ్రమలు రాకుండా ఉండాలని ఏపీ సర్కార్ కుట్ర పన్నుతోంది.' అని హరీష్ రావు స్పష్టం చేశారు.