మంత్రి ఇలాఖాలోనూ ‘డబుల్’ ట్రబుల్
ఎమ్మెల్యేలకు ‘డబుల్ బెడ్రూం’ల బాధ్యత: మంత్రి ఇంద్రకరణ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెండు పడకల ఇళ్ల విషయంలో అడుగు ముందుకు పడటమే గగనంగా మారింది. గృహనిర్మాణ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన నిర్మల్‌లో కూడా వాటికి పునాదులు పడలేదు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించడానికి ప్రభుత్వం మూడుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో రెండు గ్రామాలు(ఎర్రవల్లి, నరసన్నపేట) మినహా మరెక్కడా ఇళ్లు ఓ రూపు సంతరించుకోలేదు.
అతికష్టం మీద వరంగల్ నగరంలో పనులు మొదలయ్యాయి. ఈ పథకానికి ప్రభుత్వం ఖరారు చేసిన యూనిట్ కాస్ట్‌లో ఇళ్ల నిర్మాణం అసాధ్యమంటున్న కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనేందుకు ఆసక్తి చూపటం లేదు. చివరకు ఇసుకను ఉచితం గా, స్టీలు, సిమెంటులను తక్కువ ధరకు ఇస్తామని తాయిలాలు ప్రకటిస్తే కొన్నిచోట్ల స్పందించారు. గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్ కాస్ట్ మరింత తక్కువగా ఉండటంతో అక్కడ పనులు చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేయటంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్క ఇంటికి రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలు యూనిట్ ధరగా ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల తమకు గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్లు ఈ టెండర్ల వైపు చూడటం లేదు. కాంట్రాక్టర్లు ఆసక్తి చూపించకపోవడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన నెలకొంది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పూర్తిచేయడానికి అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషిస్తోంది. నియోజకవర్గంలో ఇళ్లను పూర్తి చేసే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించాలని భావిస్తున్నట్టు మంత్రి చెప్పారు.
కాంట్రాక్టర్లు ముందుకు రాక ఇళ్ల నిర్మాణం పనులు ప్రభుత్వ అంచనాలకనుగుణంగా ముందుకు పోవడం లేదన్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 ఇళ్లు కేటాయిస్తున్నామని, వీటిని స్థానికంగానే ఉన్న వనరులతో పూర్తిచేయడానికి ఎమ్మెల్యేలు చొరవ తీసుకునే విధంగా బాధ్యతలను అప్పగించనున్నట్లు ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు.