జగదేవ్‌పూర్: కేంద్ర ప్రభుత్వం అనాలోచిత ధోరణి వల్ల పత్తికి ఎదురుదెబ్బ తగిలిందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఫలితంగా ఇతర దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయన్నారు. ఈ గడ్డు పరిస్థితుల్లో రాష్ట్రంలో పత్తి పంట సాగు చేసే పరిస్థితి లేదన్నారు. ఈసారి రైతులు పత్తి జోలికి వెళ్లొద్దని సూచించారు. మంగళవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లో ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద విత్తన సబ్సిడీ విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయని తెలిపారు. మొత్తం 52 లక్షల మంది రైతులు ఉండగా, 906 సొసైటీలు ఉన్నాయన్నారు. గ్రామాల్లో రైతులు ఏ పంటలు సాగు చేస్తారో సర్వే చేసి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గత ఏడాది ధరలతోనే ఈ సారి కూడా విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని చెప్పారు.
విత్తనాలు సిద్ధం...
ప్రస్తుతం 60 లక్షల ఎకరాలకు సరిపడా విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ముందస్తు చర్యలో భాగంగా 7.80 లక్షల క్వింటాళ్ల విత్తనాలు నిల్వ చేశామన్నారు. ఇతర రాష్ట్రాల కంటే మన వద్దే సబ్సిడీలు అధికమన్నారు. వ్యవసాయ రంగంలో రైతులకు దాదాపు రూ.400 కోట్ల సబ్సిడీని అందిస్తున్నామని తెలిపారు. మెదక్ జిల్లాలో 24, 500 హెక్టార్లకు డ్రిప్ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. ఇక్కడి రైతులు రారాజులు అని సంబోధించారు.
కల్యాణ లక్ష్మికి రూ.510 కోట్లు..
కల్యాణ లక్ష్మి పథకం కింద రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.510 కోట్లు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మాత్రమే వర్తించే కల్యాణలక్ష్మి ఇక నుంచి బీసీలకు కూడా వర్తిస్తుందన్నారు. తెల్లకార్డు ఉన్న ప్రతి ఒక్కరు కల్యాణలక్ష్మికి అర్హులేనన్నారు.