‘నీరా’ వచ్చేస్తోంది.. త్వరలో మార్కెట్లోకి! | Minister Srinivas Goud Said First Neera Stalls Starts At Tank Bund | Sakshi
Sakshi News home page

‘నీరా’ వచ్చేస్తోంది

Published Tue, Oct 29 2019 1:31 AM | Last Updated on Tue, Oct 29 2019 1:46 PM

Minister Srinivas Goud Said First Neera Stalls Starts At Tank Bund - Sakshi

త్వరలోనే ప్రభుత్వ స్టాల్స్‌: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నీరా ఉత్పత్తులు త్వరలోనే మార్కెట్‌లోకి రానున్నాయి. నీరాను తీయడంతోపాటు అనుబంధ ఉత్పత్తుల తయారీకి అనుమతిస్తూ ఎక్సైజ్‌ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన జీవోను ఎక్సైజ్‌ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ సోమవారం విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం రాష్ట్రంలోని కల్లుగీత సహకార సొసైటీలు, తెలంగాణ గీత పారిశ్రామిక, ఆర్థిక సంక్షేమ సంస్థ, లేదా గౌడ, ఈడిగ కులాలకు చెందిన ఇతర సొసైటీల్లో సభ్యులుగా ఉన్న వారికి నీరా లైసెన్సులు ఇవ్వనున్నారు. లైసెన్సులు పదేళ్ల కాలం చెల్లుబాటు అవుతాయి. అనంతరం మళ్లీ వాటిని రెన్యువల్‌ చేస్తారు. నీరా ఉత్పత్తులను అమ్ముకునేందుకు మున్సిపాలిటీలు, పర్యాటక ప్రాంతాల్లో అనుమతివ్వనున్నారు. ఇందుకు సంబంధించి రిటైల్‌ ఔట్‌లెట్లను కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది.

కేవలం నీరాతోపాటు వాటి అనుబంధ ఉత్పత్తులైన తాటి బెల్లం, తాటి పంచదార లాంటి వాటిని కూడా లైసెన్సీలు తయారు చేసుకోవచ్చు. ప్రభుత్వ సహకార సంస్థలు, ప్రభుత్వం అనుమతిచ్చిన పరిశ్రమలకు కూడా నీరాను నాన్‌ ఆల్కహాలిక్‌ ఉత్పత్తుల తయారీకి ముడిసరుకుగా ఉపయోగించుకునేందుకు అమ్ముకునేలా లైసెన్సీలకు వెసులుబాటు ఇచ్చారు. అయితే నీరా లైసెన్సులు కేవలం నీరాను అమ్ముకునేందుకే వర్తిస్తాయి తప్ప కల్లు అమ్ముకునేందుకు వర్తించవని మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించినా, నీరాను కల్తీ చేసేందుకు యత్నించినా సంబంధిత లైసెన్సులను రద్దు చేయనున్నారు.

మార్గదర్శకాలతో కూడిన ప్రతులను మంగళవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ)లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు టి.హరీశ్‌రావు, కె. తారక రామారావు, వి.శ్రీనివాస్‌గౌడ్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, ఎక్సైజ్‌ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌లతోపాటు గౌడ కులానికి చెందిన ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, ఎమ్మెల్యే వివేకానందగౌడ్, రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజేశంగౌడ్, ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌడ ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


పాలసీ ప్రతులను విడుదల చేస్తున్న మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌. చిత్రంలో సీఎస్‌ ఎస్కే జోషి, ఎక్సైజ్‌ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ తదితరులు
ఎన్నికల హామీ మేరకు గౌడ కులస్తుల సంక్షేమానికి ప్రభుత్వం నీరా పాలసీని ప్రకటించిందని, త్వరలోనే ప్రభుత్వ నీరా స్టాల్స్‌ ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లోనే మొదటి స్టాల్‌ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. 70 ఏళ్లుగా పాలించిన ప్రభుత్వాలు గీత కార్మికులపై ఆంక్షలు పెట్టడమే కానీ వారి వృత్తికి సంబంధించిన ఎలాంటి సాయం చేయలేదన్నారు. నీరా పేరుతో ఇతర దేశాల్లో పర్యటించారు కానీ అమల్లోకి తేలేదని, గౌడ వృత్తిని కాపాడటం కోసం ‘హరితహారం’లో తాటిచెట్లను నాటిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. హైదరాబాద్‌లో నీరా అమ్మకాలకు అనుమతివ్వడం ఆనందంగా ఉందని, దశలవారీగా అన్ని జిల్లాల్లో అమ్మకాలు జరిగేలా చూస్తామన్నారు. నీరాను గీయడం, అమ్మడం కేవలం గౌడ కులస్తులే చేయాలని సీఎం చెప్పారని, ఈ మేరకు గౌడ కులస్తులకే నీరా లైసెన్సులిస్తామని చెప్పారు. నీరాలో అనేక ఔషధ గుణాలున్నాయని, షుగర్, మధుమేహ వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుందని చెప్పారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ నీరా స్టాల్స్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement