సాక్షి, నల్లగొండ : జిల్లాలో 2015లో ప్రారంభమైన మిషన్ భగీరథ పనులు వాస్తవానికి ఎన్నికల ముందే పూర్తి కావాల్సి ఉంది. కానీ, గడువులోగా భగీరథ పనులు పూర్తి కాలేదు. పదేపదే గడువులు పెంచారు. ప్రధాన పైప్‌లైన్ పనులు తీసుకున్న కాంట్రాక్టర్ ఆ పనులను విడగొట్టి సబ్ కాంట్రాక్టర్లకు ఇవ్వడంతో కూడా ఆలస్యమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్యాంకుల నిర్మాణం విషయంలో రేట్లు గిట్టుబాటు కావని కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో తీవ్రజాప్యం జరిగినట్లు తెలుస్తోంది. భగీరథ పనుల కోసం జిల్లాకు రూ.2,176 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.590 కోట్లు ఇంట్రా పైప్‌లైన్ల నిర్మాణానికే ఇచ్చారు. మొత్తం బడ్జెట్‌లో ఇప్పటి వరకు రూ.1,563 కోట్లను ఖర్చు చేశారు. నాగార్జునసాగర్, మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు ఏకేబీఆర్ (అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) నుంచి, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాలకు ఉదయ సముద్రం రిజర్వాయర్ నుంచి, మిర్యాలగూడ నియోజకవర్గాలకు సాగర్ టెయిల్‌పాండ్ నుంచి నీరు అందించాలని నిర్ణయించారు. అయితే, పనులు పూర్తిచేయడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఉన్నతాధికారులు గ్రామీణ నీటిసరఫరా శాఖకు వంద రోజుల లక్ష్యం నిర్దేశించారు. ఇప్పుడు జిల్లాలో పనుల పూర్తి కోసం వంద రోజుల ప్రణాళిక మొదలైంది.
పూర్తి కాని ప్రధాన పైప్‌లైన్
జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,100 కిలోమీటర్ల ప్రధాన పైప్‌లైన్ వేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు 3,800 కిలోమీటర్ల నిర్మాణం పూర్తి చేయగా, మరో 3వందల కిలోమీటర్ల పనులు కొనసాగుతున్నాయి.
అసంపూర్తిగా ట్యాంకుల నిర్మాణం
జిల్లాలో 1,710 ఆవాసాలకుగాను 1,536 ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించాల్సి ఉంది. ఇందులో 1,430 ట్యాంకుల నిర్మాణం పూర్తయ్యింది. మరో 106 ట్యాంకుల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో రెండు నుంచి మూడు ట్యాంకులు నిర్మించాల్సి ఉండగా ఒకటి పూర్తయి మరోటి అసంపూర్తిగా ఉన్న ఉదంతాలు ఉన్నాయి.
పూర్తి కావొచి్చన ఇంట్రా విలేజ్ పైప్‌లైన్
అన్ని ఆవాసాల్లో ‘ఇంట్రా విలేజ్’ పైప్‌లైన్లు పూర్తయ్యాయి. ఇంటింటికీ నల్లాలు బిగించే పనులు మాత్రం మందగించాయి. నల్లాలు దెబ్బతినకుండా పిల్లర్లు నిర్మించి బిగించే పనులు కొనసాగుతున్నాయి. పనుల పూర్తికి సంబంధించి అధికారులు చెబుతున్న లెక్కలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు ఏమాత్రం పొంతన కనిపించడం లేదు.
మండలకేంద్రంలో మంచినీళ్లు ఏవీ ?
గుర్రంపోడు మండలకేంద్రంలో ఇంతవరకు మిషన్ భగీరథ మంచినీళ్లు లేవు. ప్రక్క గ్రామాల్లో వాళ్లు మిషన్ భగీరథ నీళ్లు బాగా రుచిగా ఉంటున్నాయని, మాకు క్యాన్ల నీళ్లు కొనుక్కోనే బాధ తప్పిందని అంటున్నారు. మండలకేంద్రంలో ఉన్న మాకేమో ఇంతవరకు మంచినీళ్లు లేవు. ఓవర్‌హెడ్ ట్యాంకులకే ఇంతవరకు కనెక్షన్ ఇవ్వలేదు. అంతర్గత పైపులైన్లు కొంతవరకే వేశారు. మిషన్ భగీరథ నీళ్లు వస్తే నీళ్లు కొనుక్కునే బాధ తప్పుతుంది. అధికారులను ఎప్పుడు అడిగినా పైపులైన్ల పనులు పూర్తి కాలేదని అంటున్నారు. – వనమాల పుష్పలత, గుర్రంపోడు
అనేకమార్లు అధికారులకు విన్నవించా
మునుగోడు మండలంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా మంచి నీరు అందుతోంది. మా గ్రామానికి మాత్రం ఇంకా అందడం లేదు. ఇంటింటికీ నల్లాలు బిగించి తాగునీరు సరఫరా చేయాలని అధికారులకు అనేకమార్లు విన్నవించా. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. 10 నెలలుగా అడుగుతున్నా మా గోడు వినే నాథుడే లేకుండా అయ్యారు. గ్రామ ప్రజలంతా నిత్యం నా వద్దకు వచ్చి నల్లాలు ఎందుకు పెట్టించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
– పంతంగి పద్మ, సర్పంచ్, జమస్థాపల్లి, మునుగోడు
పనులు ఊపందుకున్నాయి
వంద రోజుల ప్రణాళికలో భాగంగా పనులు ఊపందుకున్నాయి. ప్రధాన పైప్‌లైన్ పూర్తి కావొస్తోంది. ఇంట్రా విలేజ్ పైప్‌లైన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. 106 ట్యాంకుల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వంద రోజుల్లో పనులన్నీ పూర్తి చేసేలా కాంట్రాక్టర్లకు తగిన సూచనలు చేశాం.
– పాపారావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
Comments
Please login to add a commentAdd a comment