
నిజాంషుగర్స్‌ను పునరుద్ధరించాలి: భట్టి
బోధన్: నిజాం షుగర్ ఫ్యాక్టరీని మూసివేసి, టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు దానిని కబళించేందుకు యత్నిస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ ఫ్యాక్టరీ ప్రజల హక్కు అని, దానిని పునరుద్ధరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
నిజాంషుగర్ ఫ్యాక్టరీని తక్షణమే పునరుద్ధరించాలన్న ప్రధాన డిమాండ్‌తో మాజీమంత్రి పి. సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో గురువారం కామారెడ్డి జిల్లా కోటగిరి మండలం కొల్లూరులో చేపట్టిన అఖిల పక్ష రైతు పాద యాత్రను ప్రారంభించారు. రైతులనుద్దేశించి భట్టి విక్రమార్క మాట్లాడారు. అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని నడుపుతామని ఎన్నికలసభల్లో కేసీఆర్ వాగ్దానం చేసి ఇప్పుడు పట్టించుకోవడంలేదని విమర్శించారు. రైతు సమస్యలను ప్రభుత్వం విస్మరించిందని అన్నారు.