
కొత్త.. కొత్తగా..
కొత్తగా కొలువుదీరుతున్న తెలంగాణ శాసనసభలో మహానగర ప్రజాప్రతినిధులు నేడు శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గతానికి పూర్తి భిన్నంగా ఈ సభలో అత్యధిక సభ్యులు...
- నేడు ప్రమాణస్వీకారం చేయనున్న నగర ఎమ్మెల్యేలు
- తొలిసారి అసెంబ్లీలో అడుగిడుతున్నవారే అధికం
- ఇరవై నాలుగులో పదమూడు మంది కొత్తవారే
సాక్షి, సిటీబ్యూరో : కొత్తగా కొలువుదీరుతున్న తెలంగాణ శాసనసభలో మహానగర ప్రజాప్రతినిధులు నేడు శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గతానికి పూర్తి భిన్నంగా ఈ సభలో అత్యధిక సభ్యులు శాసనసభకు కొత్తవారు కావటం విశేషం. మహానగర పరిధిలో మొత్తం అరవైనాలుగు మంది శాసనసభ్యుల్లో పదమూడు మంది తొలిసారి శాసనసభ గడప తొక్కుతున్నవారే.
నగరంలో తొమ్మిది స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీలో తలసాని శ్రీనివాసయాదవ్ (సనత్‌నగర్), జి.సాయన్న(కంటోన్మెంట్), ప్రకాష్ గౌడ్ (రాజేంద్రనగర్)లను మినహాయిస్తే జూబ్లీహిల్స్- గోపీనాథ్, కుత్బుల్లాపూర్- వివేకానంద్, కూకట్‌పల్లి - కృష్ణారావు, శేరిలింగంపల్లి - గాంధీ, మహేశ్వరం - తీగల కృష్ణారెడ్డి, ఎల్బీనగర్ - ఆర్.కృష్ణయ్యలు శాసనసభకు కొత్తవారే. ఎంఐఎం తరఫున గెలిచిన ఏడుగురిలో జాఫర్ హుస్సేన్ (నాంపల్లి), కౌసర్ మొహినోద్దీన్ (కార్వాన్) తొలిసారిగా ఎన్నికయ్యారు.
మిగిలినవారంతా గత సభలో ఉన్నవారే. వీరిలో యాకుత్‌పురా నుంచి విజయం సాధించిన ముంతాజ్‌ఖాన్ వరుసగా ఐదుమార్లు విజయం సాధించి నగరంలో ఓ కొత్త రికార్డ్ సృష్టించారు. ఇక బీజేపీలో అంబర్‌పేట ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి వరసగా మూడవసారి విజయం సాధించగా, ముషీరాబాద్ నుంచి డాక్టర్ లక్ష్మణ్ విజయం సాధించటం ఇది రెండవసారి.
గతంలో నగర మేయర్‌గా పనిచేసిన తీగల కృష్ణారెడ్డి ఈ మారు శాసనసభకు వస్తుండగా.. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉన్న రాజాసింగ్ (బీజేపీ తరఫున గోషామహల్ నుంచి), జాఫర్ హుస్సేన్ (ఎంఐఎం తరఫున నాంపల్లి నుంచి) తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ముగ్గురిలో సికింద్రాబాద్ నుంచి తిగుళ్ల పద్మారావు రెండవ సారి విజయం సాధించగా.. మల్కాజిగిరిలో కనకారెడ్డి, పటాన్‌చెరులో మహిపాల్‌రెడ్డిలు శాసనసభలో తొలిసారి అడుగుపెడుతున్న వారే.