ఎమ్మెల్సీలు జంప్
సాక్షిప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్, టీడీపీలకు జిల్లాలో మరో దెబ్బ తగిలింది. ఈ రెండు పార్టీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌లో చేరారు. టీడీపీ శాసన మండలి పక్ష నేత బోడకుంటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం.. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో బుధవారం గులాబీ కండువాలు కప్పుకున్నారు. పీఆర్‌టీయూ తరఫున ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న పూల రవీందర్ కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ పరిణామంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలను, 8 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. తాజాగా ఎమ్మెల్సీలు ముగ్గురు చేరడంతో రాజకీయంగా టీఆర్‌ఎస్‌కు మరింత బలం చేకూరింది. జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్ సైతం గతంలో టీఆర్‌ఎస్ మద్దతుతోనే గెలిచిన వారు కావడం గమనార్హం.
సాధారణ ఎన్నికలు జరిగిన తక్కువ సమయంలోనే ఎమ్మెల్సీలు ఇలా పార్టీ మారడం చర్చనీయంశంగా మారింది. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో బోడికుంట వెంకటేశ్వర్లుకు ఇటీవలే మండలిలో పార్టీ పక్ష నేత పదవి వచ్చింది. ఇలా పదవి వచ్చిన కొద్ది రోజుల్లేనే ఈయన పార్టీ మారడంతో జిల్లాలోని టీడీపీ శ్రేణులు ఢీలా పడిపోయాయి. గురువారం టీడీపీ జిల్లా స్థాయి సమావేశం జరగనున్న తరుణంలో వెంకటేశ్వర్లు పార్టీ మారడం ఆ పార్టీ శ్రేణులను కుంగదీస్తోంది.
కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత నియోజకవర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. సుదీర్ఘకాలంగా పొన్నాల లక్ష్మయ్యతో రాజలింగంకు విభేదాలు ఉన్నాయి. ఇటీవల ఎన్నికల తరుణంలోనూ ఇవి బయటపడ్డాయి. శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష నేత ఎన్నికల విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్‌పై రాజలింగం సంచలన ఆరోపణలు చేశారు.
అయినా శాసన మండలిలో ప్రతిపక్ష నేత పదవికి డి.శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఇది కూడా రాజలింగం పార్టీ మారడానికి కారణంగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పూల రవీందర్ 2013 ఫిబ్రవరిలో జరగిన ఎన్నికల్లో ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. బోడికుంట వెంకటేశ్వర్లు, నాగపురి రాజలింగం 2009లో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీలు ఎన్నికయ్యారు.
పొన్నాల నాయకత్వం నచ్చకనే కాంగ్రెస్‌ను వీడా.. ఎమ్మెల్సీ రాజలింగం
జనగామ : పొన్నాల లక్ష్మయ్య అసమర్థ నాయకత్వం నచ్చకనే 40 ఏళ్ల కాంగ్రె స్ అనుబంధాన్ని తెంచుకుని టీఆర్‌ఎస్‌లో చేరినట్లు ఎమ్మెల్సీ రాజలింగం అన్నా రు.. తెలంగాణ పునర్నిర్మాణం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని చెప్పారు.
బుధవారం ఆయన ఫోన్‌లో ‘సాక్షి’తో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీపై ఎనలేని విశ్వసనీయత ఉందని, అయితే కనీసం సొంత జి ల్లాలో కూడా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేక పోవడమే కాకుండా ఆయన కూడా ఘోరంగా ఓడినా పొన్నాలను ఇంకా టీ పీసీసీ చీఫ్‌గా కొనసాగించడం సరైంది కాదన్నారు. పొన్నాల కొనసాగింపుతో కార్యకర్తల్లో, నాయకుల్లో పార్టీపై ఉన్న నమ్మకం సన్నగిల్లుతుందన్నారు.
పొన్నాల పాలనలో జనగామ నియోజకవర్గం భ్రష్టుపట్టిపోయిందని విమర్శించారు. 1978 నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చానని, పొన్నాల లక్ష్మయ్య కంటే కాంగ్రెస్‌లో తానే సీనియర్‌నని తెలిపారు. పొన్నాల నాయకత్వంలో కాంగ్రెస్ నష్టపోతుందని చెప్పారు. అభివృద్ధిని కాంక్షించి టీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిల సహకారంతో జనగామ నియోజకవర్గ అభివృద్ధిలో పాలుపంచుకుంటానని ఆయన వెల్లడించారు.