
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో త్వరలో ఖాళీకానున్న పట్టభద్రులు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణలో మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ నియోజకవర్గం పట్టభద్రుల స్థానం నుంచి కె.స్వామిగౌడ్, ఉపాధ్యాయుల స్థానాల్లో మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ నియోజకవర్గం నుంచి పి.సుధాకర్‌రెడ్డి, వరంగల్–ఖమ్మం–నల్లగొండ స్థానం నుంచి పూల రవీందర్‌ల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల నుంచి మే 1వ తేదీతో ఎంఎస్ ప్రభాకర్‌రావు పదవీకాలం పూర్తికానుంది. ఇక ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీల కోటాలో కె.రవికిరణ్‌వర్మ (గోదావరి జిల్లాల నియోజకవర్గం), బొడ్డు నాగేశ్వరరావు (కృష్ణా–గుంటూరు జిల్లాల నియోజకవర్గం), ఉపాధ్యాయ ఎమ్మెల్సీల కోటాలో జి.శ్రీనివాసులనాయుడు (ఉత్తరాంధ్ర జిల్లాల నియోజకవర్గం)ల పదవీ కాలం పూర్తికానుంది. అలాగే విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ప్రతి నిధిగా ఎన్నికైన ఎంవీవీఎస్ మూర్తి ఇటీవల మృతి చెందడంతో ఆ స్థానానికి ఉపఎన్నికలు నిర్వహిం చేందుకూ ఈసీ షెడ్యూల్ ప్రకటించింది.
ఇదీ షెడ్యూల్..
నోటిఫికేషన్ జారీ: ఫిబ్రవరి 25
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: మార్చి 5
నామినేషన్ల పరిశీలన: మార్చి 6
నామినేషన్ల ఉపసంహరణ గడువు: మార్చి 8
ఎన్నికలు: మార్చి 22 (ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు)
కౌంటింగ్: మార్చి 26
ఎన్నికల ప్రక్రియ పూర్తి: మార్చి 28లోపు