
సోమవారం హెచ్‌ఐసీసీలో జ్యోతి ప్రజ్వలన చేసి ఈ–గవర్నెన్స్ సదస్సును ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో కేంద్రమంత్రి చౌదరి, సీఎస్ ఎస్‌కే జోషి తదితరులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 180 రకాల పౌర సేవలను మొబైల్ ద్వారా అందించేందుకు ‘టీ యాప్ ఫోలియో’ పేరుతో త్వరలో కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. ఇది మీ–సేవ ప్రాజెక్టుకు 2.0 (ఆధునిక వెర్షన్) అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో సోమవారం జరిగిన ఈ–గవర్నెన్స్ జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. డిజిటల్ ప్రజాస్వామ్యానికి ప్రజలు డిజిటల్ విప్లవం బాట వేయాలని, సాంకేతిక విజ్ఞాన ఫలాలను ప్రజలు ఆర్థికాభివృద్ధికి వినియోగి ంచుకోవాలని పిలుపునిచ్చారు. ఏడేళ్ల కిందట ప్రారంభమైన మీ–సేవ కేంద్రాల ద్వారా రాష్ట్రంలో జరిగిన లావాదేవీల సంఖ్య ఇటీవలే 10 వేల కోట్లు దాటిందని చెప్పారు. రాష్ట్రంలో 4,500 మీ–సేవ కేంద్రాల ద్వారా ప్రతి రోజూ 1.5 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయని వివరించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా పౌర సేవల్లో ప్రభుత్వ ప్రమేయాన్ని తగ్గించి పరిపాలన పాత్రను విస్తృతం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను మంత్రి వివరించారు. వాహన యజమానుల సమస్యలను తొలగించేందుకు ‘ఆర్టీఏ ఎం–వ్యాలెట్’పేరుతో యాప్‌ను ప్రవేశపెట్టగా తొలి మూడు నెలల్లోనే 13 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకొచ్చిన కొత్త పారిశ్రామిక విధానం ‘టీఎస్ ఐపాస్’కింద పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులిస్తున్నామని, ఇప్పటివరకు 6 వేల పరిశ్రమలకు అనుమతులు జారీ చేయగా రూ. 1.20 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయన్నారు. సులభతర సంస్కరణల అమలులో రాష్ట్రం గతేడాది అగ్రస్థానంలో నిలిచిందన్నారు. భవన నిర్మాణ అనుమతులకు కేవలం ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, 21 రోజుల గడువులోగా అనుమతులు జారీ చేసేందుకు కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. టీ–ఫైబర్ కార్యక్రమం ద్వారా 15 ఎంబీపీఎస్‌ల వేగంతో రాష్ట్రంలోని ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నామని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలకు 2 జీబీ వేగంతో నెట్ కనెక్షన్లు ఇవ్వనున్నామని, ఈ ప్రాజెక్టు ద్వారా టీవీలనే స్మార్ట్ కంప్యూటర్లుగా వినియోగించుకునేందుకు అవకాశం లభిస్తుందన్నారు.
2.95 కోట్ల బోగస్ రేషన్‌కార్డులు తొలగించాం: కేంద్ర మంత్రి చౌదరి
పౌర సేవలను వేగంగా, పారదర్శకంగా అందించడంతోపాటు వ్యవస్థలో అవినీతి నిర్మూలనకు ఈ–గవర్నెన్స్ దోహదపడుతోందని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి సీఆర్ చౌదరి తెలిపారు. ఆధార్‌తో అనుసంధానం కాని 2.95 కోట్ల రేషన్ కార్డులకు నిత్యవసర వస్తువులను నిలిపివేశామన్నారు. దీంతో ఏటా రూ. 17 వేల కోట్ల విలువైన నిత్యవసర సరుకులు అర్హుల చేతికి అందుతున్నాయన్నారు. ఐటీ, ఈ–గవర్నెన్స్‌లో తెలంగాణ పనితీరు బాగుందని ప్రశంసించారు. కార్యక్రమంలో కేంద్ర ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యదర్శి కె.వి. ఇయాపెన్, ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ కార్యదర్శి అజయ్ ప్రకాశ్ సాహ్ని, యూఐ డీఏఐ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, జీఎస్‌టీఎన్ చైర్మన్ అజయ్ భూషణ్ పాండే, ప్రభుత్వ సీఎస్ ఎస్‌కే జోషి, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.