
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడికి దేశంలోనే తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలతో, అధునాతన సాంకేతికతతో రూపొందించిన బయోసేఫ్టీ లెవల్ (బీఎస్‌ఎల్)- 3 వైరాలజీ ల్యాబ్‌ను కేంద్రమంత్రులు గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... దేశంలోనే పీపీఈ కిట్లను తయారు చేస్తున్నామన్నారు. ఢిల్లీ మర్కజ్ ఘటన లేకుంటే కరోనా కేసుల సంఖ్య ఇంత తీవ్రంగా ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా నివారణకు కలిసికట్టుగా కృషి చేద్దామని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. వైరాలజీ ల్యాబ్ రూపకల్పన చేసినవారిని ఆయన అభినందించారు. (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా కాటు)
కరోనా కట్టడికి అన్ని చర్యలు: కేటీఆర్
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. గబ్చిబౌలిలో 20 రోజుల్లోనే 1500 పడకలతో టిమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోవిడ్-19 చికిత్స కోసం 8 ప్రత్యేక హాస్పిటళ్లను ఏర్పాటు చేశామన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి వైద్య సహాయం అందిస్తున్నామని, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పారు. పేద కుటుంబాలకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీలో ఏర్పాటైన ఈ మొబైల్ వైరాలజీ ల్యాబ్‌లో కరోనాతోపాటు అనేక ఇతర వైరస్‌ల నిర్ధారణ పరీక్షలకు, పరిశోధనలు నిర్వహించవచ్చు. ఐ క్లీన్, ఐ సేఫ్ సంస్థల సహకారంతో డీఆర్‌డీవో తయారైన ఈ ల్యాబ్‌లో ప్రతిరోజు సుమారు వెయ్యి నిర్థారణ పరీక్షలు చేయవచ్చు. (హెచ్సీక్యూ మందుల అమ్మకాలపై ఆంక్షలు)
Comments
Please login to add a commentAdd a comment