
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): వారం వ్యవధిలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథలుగా మిగిలిన సంజన, హనుమకు అన్ని విధాలా సాయం అందిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ‘అమ్మనూ కోల్పోయింది’అనే శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి విశేష స్పందన వచ్చింది. కిషన్‌రెడ్డి స్పందించారిలా...
‘వీ అండ్ షీ’ఎన్జీవో వ్యవస్థాపకురాలు శ్రావ్య మందాడి తన ట్విట్టర్ అకౌంట్‌లో ‘సంజనకు సాయం చేయండి’అంటూ ‘సాక్షి’ కథనాన్ని ట్వీట్ చేశారు. 10 నిమిషాల వ్యవధిలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పందించారు. ‘వారి వివరాలను నాకు పంపండి, నేను వారికి అండగా నిలుస్తా’అని హామీనిచ్చారు. అనంతరం ‘సాక్షి’ ప్రతినిధికి ఫోన్ ద్వారా సంజన, హనుమ బాధ్యత తనదేనని, వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
కేటీఆర్ ఆఫీస్ నుంచి: ‘సాక్షి’కథనం చదివి మంత్రి కేటీఆర్ కార్యాలయం నుంచి ఒకరు సంజనకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రి ఖర్చులు ఎంతయ్యాయి.. ఎక్కడ తెచ్చారు.. లాంటి వివరాలపై ఆరా తీశారు. అప్పు చేసి రూ.4 లక్షలు వైద్య బిల్లులకు చెల్లించామని సంజన జవాబు ఇవ్వగా.. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయమందించేలా కృషి చేస్తానని హామీనిచ్చారు.