కుర్మగూడలో పూర్తయిన మోడల్ పాఠశాల భవనం
చంచల్‌గూడ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు ఆసక్తి చూపుతున్న విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ విద్యాశాఖ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లోను అధునాతన సౌకర్యాలతో భవనాలు నిర్మించనున్నారు. ఈమేరకు 2014లో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ, మోడల్ పాఠశాలల నిర్మాణాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో యాఖుత్‌పురా నియోజకవర్గంలోని కుర్మగూడ డివిజన్‌లో ఖాళీ ప్రభుత్వ స్థలంలో మోడల్ పాఠశాల నిర్మాణం పూర్తయింది. ఈ భవనానికి 2016లో అప్పటి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత భవన నిర్మాణం పూర్తయింది. త్వరలో విద్యా శాఖ ఈ పాఠశాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
కబ్జా చెర వీడి...పాఠశాలగా మారి..
ఈ ప్రాంతంలోని ఐదెకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అప్పట్లో స్థానికుడొకరు ఆక్రమించేందుకు యత్నించాడు. సైదాబాద్ మండల రెవెన్యూ సిబ్బంది పోలీసుల సహకరంతో సదరు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి ప్రభుత్వానికి అప్పగించారు. కాగా ఇక్కడ 3000 చ.గ స్థలంలో పాఠశాల నిర్మించి, మరికొంత స్థలాన్ని ట్రాన్స్‌కో సంస్థకు అప్పగించారు.
కాలేజీ నిర్మాణం అనుమానమే!
ఇదిలా ఉండగా యాఖుత్‌పురా నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలను నిర్మించాలని అప్పటి ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ప్రభుత్వానికి విన్నవించారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందనా రాలేదు. కాగా కుర్మగూడ డివిజన్‌లో ఉన్న స్థలంలోనైనా కళాశాలల నిర్మాణం చేపట్టాలని అప్పటి డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి విన్నవించారు. కళాశాల నిర్మాణానికి సంబంధించి సీఎంతో చర్చిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ స్థలంలో విద్యుత్ సబస్టేషన్‌తో పాటు పాఠశాల నిర్మాణం పూర్తయిది. కాలేజీ నిర్మాణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఇక కాలేజీల నిర్మాణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment