మోహిని అలియాస్.. ఉమక్క | Mohini alias .. uma | Sakshi
Sakshi News home page

మోహిని అలియాస్.. ఉమక్క

Published Sun, Jul 27 2014 1:32 AM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM

మోహిని అలియాస్.. ఉమక్క - Sakshi

మోహిని అలియాస్.. ఉమక్క

పదకొండేళ్లకే అడవిబాట
జనశక్తి దళాల్లో పదమూడేళ్లు
జనంలో బీడీ కార్మికుల నేత
జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: విప్లవమే ఆమెకు పేరు పెట్టింది. మాటలు నేర్పింది. పాటలు నేర్పింది. చదువు నేర్పింది. అజ్ఞాతంలో ఉన్నప్పుడే ఆమె ఏడడుగులు వేసింది. దళం దీవెనలతోనే పెళ్లి చేసుకుంది. నవమాసాలు మోసిన తన బిడ్డకు ఆ దళమే కాపలాగా పురుడుపోసింది. కల్లోలిత జిల్లాలో పోలీసుల కాఠిన్యాన్ని, లాకప్‌లో చిత్ర హింసలను, వరుస ఎన్‌కౌంటర్లను ఆమె కళ్లారా చూసింది. ప్రతక్ష్యంగా అనుభవించింది. ఎన్నోసార్లు పోలీసు దాడుల నుంచి త్రుటిలో తప్పించుకుంది. పదకొండేళ్ల వయస్సులో బతుకుదెరువుకు బీడీలు చుట్టింది. లోకం పోకడ తెలిసీ తెలియని తనంలోనే కన్నవాళ్లను, ఉన్న ఊరును వదిలింది. ‘కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ.. కొడవళ్లు చేపట్టవే చెల్లెమ్మ...’ అంటూ జనశక్తి పోరుబాట నడిచింది.

ఎందరినో తనవెంట నడిపించింది. పదమూడేళ్ల పాటు అజ్ఞాతవాసం గడిపింది. ఆమె తుల ఉమ. అసలు పేరు మోహిని. బీడీ కార్మికులు, రైతుకూలీ పోరాటాలు, సారా ఉద్యమం, తెలంగాణ ఉద్యమంతో అందరికీ సుపరిచితమైన తుల ఉమకు టీఆర్‌ఎస్ రాజకీయ పునర్జన్మను ఇచ్చింది. అందివచ్చిన అవకాశాలతో జెడ్పీ చైర్‌పర్సన్ పదవిని అధిరోహించిన మోహిని అలియాస్ ఉమ లైఫ్‌స్టైల్ ఈవారం ‘సాక్షి’ సండేస్పెషల్.
 
పార్టీ సహచరుడితో పెళ్లి
1985లో అజ్ఞాతంలోనే పెళ్లి చేసుకున్నా. మెట్‌పల్లి మండలం చెవులమద్దికి చెందిన రాజేందర్‌కుమార్ అప్పుడు జనశక్తిలో జగిత్యాల జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉండే. నాకు చదువు రాదు. ఆయనే నేర్పాడు. అన్నింటా తోడుగా ఉండేవాడు. పార్టీకి చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. గోదావరిఖని ఏరియాలో అప్పటి పార్టీ నేత చలపతిరావు సమక్షంలో పెళ్లి జరిగింది. పెళ్లంటే.. దళం సమక్షంలో ఇద్దరం దండలు మార్చుకున్నాం.
 
పోలీసులంటే భయం

మాది మేడిపల్లి మండలంలో మారుమూల పల్లె మోత్కురావుపేట. మా ఊళ్లో బడి లేదు. పేద కుటుంబం. గొర్లు కాయటం.. బీడిలు చుట్టడం.. మేం ముగ్గురం. ఇద్దరు అక్కలు. నేనే చిన్నదాణ్ని. గోవిందారం దొరలంటే ఆ పల్లెల్లో హడల్. వాళ్లదే ఆధిపత్యం. అందమైన అమ్మాయిలు వాళ్ల కంట్లోబడితే  పాపంగా ఉండేది. 1983.. నాకు పదకొండు పన్నెండేళ్ల వయస్సు. మా పల్లెకు చాటుమాటుగా నక్సలైట్లు వచ్చేటోళ్లు.. అన్నలను వెతుక్కుంటూ పోలీసోళ్లు వచ్చేటోళ్లు. ఎవరన్నా అన్నలకు తిండి పెట్టినట్లు తెలిస్తే... చిత్రహింసలు పెట్టేటోళ్లు. పోలీసులంటే టై. బూట్ల చప్పుడు వింటేనే అప్పుడు నాకు వణుకు పుట్టేది.
 
నిర్బంధం నీడలో పురుడు
1986లో బాబు పుట్టాడు. నిండు గర్భిణిగా ఉన్నప్పుడు కార్ఖానగడ్డలో ఓ ఇంట్లో తలదాచుకున్నా. బాబు పుట్టగానే.. వారం రోజుల పాటు చలపతిరావు భార్య నాతో ఉంది. మేమున్న సమాచారం పోలీసులకు లీకైనట్లు తెలిసింది. రాత్రికి రాత్రే పసిబిడ్డతో  నిజామాబాద్‌కు వెళ్లిపోయా. మరుసటి రోజే షెల్టర్ తీసుకున్న ఇంటిపై పోలీసులు దాడి చేసి.. తాళం వేశారు. నాలుగు నెలల తర్వాత  బాబును అత్తామామలకు అప్పగించా. నందిపేట, నవీపేట ఏరియాలో మళ్లీ బీడీ కార్మికులను సంఘటితం చేసేందుకు సెమీ లీగల్‌గా పని చేశా. అప్పుడే పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉమ అని పేరు పెట్టాడు. అప్పట్నుంచీ సగం అజ్ఞాతం.. సగం జనజీవనం.
 
అత్తామామలపైనే పోరు
1987లో మెట్‌పల్లిలో శ్రామిక శక్తి బీడీ వర్కర్క్స్ యూనియన్ పేరుతో ఆఫీసు తెరిచా.  మా అత్తామామలది  భూస్వామ్య కుటుంబం.  చెవులమద్దిలో ఉన్న భూములను పంపిణీ చేయాలని మెట్‌పల్లి రెవెన్యూ ఆఫీస్ ఎదుట ధర్నా చేసినా. వాళ్లే స్వచ్ఛందంగా 200 ఎకరాలు ప్రభుత్వానికి రాసిచ్చారు. ఊళ్లో పేదలకు పంపిణీ చేయటంతో.. ఇళ్లు కట్టుకున్నారు. దానికే ‘తుల నగర్’ అనే పేరు పెట్టుకున్నారు.  ఎన్‌వీ కృష్ణయ్య సారథ్యంలో బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పని చేశా. ప్రగతి శీల మహిళా సంఘం (స్త్రీ విముక్తి) జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నా.
 
లాకప్‌లో 5 రోజులు
దూబగుంట కంటే ముందే జగిత్యాలలో మద్యం తాగొద్దు.. దుకాణాలు ఎత్తేయండి.. అంటూ భారీ ర్యాలీ నిర్వహించినం. బీడీ కార్మికులు నెల రోజుల పాటు సమ్మె చేశారు. యాజమాన్యాలు దిగివచ్చాయి. సిరిసిల్ల ప్రాంతంలో జనశక్తి నేత జలపతి రెడ్డి ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. వైజాగ్‌లో ఆల్ ఇండియా ఫెడరేషన్ ట్రేడ్ యూనియన్‌కు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా ఎన్నికయ్యాను. ఆ వేదికపై ఉండగానే.. జలపతిరెడ్డి ఎన్‌కౌంటర్ వార్త విని సృహ తప్పి పడిపోయాను.  పార్టీ బంద్‌కు పిలుపునిచ్చింది. చల్‌గల్‌లో బస్సులపై దాడి చేసి ఆపేసినం. పోలీసులకు దొరికినం. అసభ్యకరంగా మాట్లాడితే పోలీసులకు ఎదురుతిరిగినా. అయిదు రోజుల పాటు లాకప్‌లో నిర్బంధం. మోకాళ్లపై లాఠీ దెబ్బలు. ఇప్పటికీ ఆ దెబ్బలు బాధిస్తూనే ఉన్నాయి. అప్పుడు నేను జనశక్తి జిల్లా కమిటీ సభ్యురాలిని.
 
ఎల్‌ఎల్‌బీ చేయలేకపోయా
కరీంనగర్ వావిలాలపల్లిలో ఏఐఎఫ్‌టీయూ ఆఫీసు తెరిచాను. లారీ, రవాణా కార్మికులను కూడగట్టాను. పార్టీ సిద్ధాంతాల ప్రచారానికి జనంలోకి వెళ్లాలని, ప్రజాసంఘాలు బలపరిచిన అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయాను. అప్పుడే చొప్పదండి నుంచి వీరయ్య, సిరిసిల్ల నుంచి చలపతిరావు పోటీ చేశారు. 1995లో పార్టీలో చీలికలు వచ్చాయి. నా భర్త రాజేందర్ మెట్‌పల్లి కోర్టులో లొంగిపోయాడు. 1996 నుంచి నేనూ ఇన్‌యాక్టివ్ అయ్యాను. జిల్లాను వదిలి హైదరాబాద్ వెళ్లాం. ప్రజా సంఘాల సమావేశాలు, సభలకు హాజరయ్యేదాణ్ని. అక్కడే ఓపెన్ వర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాను. ఫీజు కట్టే స్తోమత లేక ఎల్‌ఎల్‌బీ చేయలేకపోయా.
 
కేసీఆర్ స్ఫూర్తి
కరీంనగర్‌లో టీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన మొదటి సింహగర్జన సభ చూసేటందుకే హైదరాబాద్ నుంచి వచ్చినా. అదే స్ఫూర్తితో తెలంగాణ జెండా పట్టుకున్నా. అప్పుడే జెడ్పీటీసీ ఎన్నికలొచ్చాయి. మేడిపల్లి నుంచి పోటీ చేస్తావా.. అని అప్పటి జెడ్పీ చైర్మన్ అభ్యర్థి రాజేశ్వరరావు ఫోన్ చేసి అడిగాడు. నాకైతే ఆసక్తి లేదని చెప్పినా. మా ఆయన తోపాటు మిత్రుల ఒత్తిడితో మరుసటి రోజు రాజేశ్వరరావును కలిసినా. నామినేషన్ వేయమన్నారు. వేసినా. టీఆర్‌ఎస్ పార్టీ అంటే నక్సలైట్ పార్టీ అనే ప్రచారం జరుగుతోందని.. నన్ను విత్‌డ్రా చేసుకొమ్మన్నారు. చేసుకున్నా. అదే ఎన్నికల ప్రచార సభకు జగిత్యాలకు వచ్చినప్పుడు కేసీఆర్‌ను కలిశాను.

ఆ పరిచయంతో హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగు డివిజన్లకు ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారు. తర్వాత మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేశారు. 2006లో కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కార్మికశాఖ సెంట్రల్ అడ్వయిజరీ బోర్డులో నేను మెంబర్‌గా ఉన్నా. జగిత్యాల ఏరియాలో బీడీ కార్మికుల డిమాండ్లు సాధ్యమయ్యాయి. 2009లో కేసీఆర్‌ను అరెస్ట్ చేసినప్పుడు ఆయన వెన్నంటి ఉన్నా. నిజాం ఆసుపత్రికి వెళితే.. ‘ఉమా.. గో ఎహెడ్’ అన్నారు. అందుకే ఉద్యమ బాట వీడలేదు. 2009లో మెట్‌పల్లి ఎమ్మెల్యే టిక్కెట్టు వస్తుందని అనుకున్నా. రాలేదు. ఈసారి జెడ్పీ సీటు బీసీ మహిళకు రిజర్వు కావటంతో కేసీఆర్ ముందే అభయమిచ్చారు. ఆయన ఆశీర్వాదంతో జెడ్పీ చైర్‌పర్సన్ అయ్యా..
 
 
మల్లక్కతో అటాచ్
బీడీకార్మికుల సమస్యలను తెలుసుకునేందుకు రంగవల్లి సారథ్యంలో యూనివర్సిటీ విద్యార్థులు ఒకసారి మా పల్లెకు వచ్చారు. సమస్యలు చెప్పమంటే చెప్పినా. వాళ్లకు చాయ్ తెమ్మంటే నేనే తెచ్చిచ్చినా. మా పక్కింట్లో రాజేశ్వరి అని దోస్త్ ఉండే ఎటు వోయినా నన్ను తోడుగా తీస్కపోయేది. ఆమెతోనే నక్సలైట్లతో పరిచయం ఏర్పడింది. అన్నలు చెప్పిండ్రు... బీడీ కార్మికుల సమస్యలు తెలుసుకుందాం.. రా అని చెప్పి రాజేశ్వరి నన్ను పక్క ఊరికి తీసుకెళ్లింది. ఆ రోజు మళ్లీ మా ఇంటికి పోలేకపోయినా. ఏమంటరో.. ఏమనుకుంటరో.. అనే భయంతోనే తెల్లారి కూడా పోలే.. ఒకటీ రెండు రోజులు... వారాలు గడిచాయి.

తోటి అక్కలతో తిరుగుతున్నా. ఇంట్లో ఏడుస్తున్నరు.. రమ్మంటున్నరని కబురు వచ్చింది. నెలరోజుల తర్వాత ఊరికి పోయినా. ఇంటి దగ్గరే ఉంటా అనుకున్నా. లేదు లేదు నువ్వు చురుగ్గా ఉన్నావ్... గ్రామస్థాయిలో ర్యాలీలు తీయాలి.. కూలీ రేట్లు పెంచేందుకు పోరాడాలే.. పార్టీ పాఠాలు నేర్చుకోవాలే... అని నరేందర్ అన్న పట్టుబట్టారు. కారం మల్లక్క అనే దళ సభ్యురాలితో నన్ను అటాచ్ చేశారు. అప్పటికే అన్నలల్ల కలిసిపోయిందనే ప్రచారం మొదలైంది. అప్పుడు వ్యవసాయ కూలీ రోజుకు రెండు, మూడు రూపాయలుండే. కూలీ పెంచాలని, రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వాలని ర్యాలీలు చేసినం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement