జుట్టును బట్టే గుర్తింపు!
జుట్టు ఉన్నమ్మ ఎన్ని కొప్పులైనా పెట్టుకోవచ్చు అంటారు. వయసును బట్టి కూడా మన దేశంలో కేశాలంకరణ మారుతూ ఉంటుంది. అయితే ఆఫ్రికాలో మాత్రం.. జుట్టుకు, వాళ్ల ఆస్తిపాస్తులకు సంబంధం ఉంటుందట! అవును.. విక్టోరియా షెరోస్ రాసిన ఎన్సైక్లోపీడియా ఆఫ్ హెయిర్.. ఎ కల్చరల్ హిస్టరీ అన్న పుస్తకంలో కేశాలంకరణ.. వ్యక్తి నమ్మకాలను, వయసును, మతంతో పాటు, లింగ భేదం లాంటి వైవిధ్యాలను కూడా చెబుతుందని అంటున్నారు. జుట్టు అలంకరణను బట్టి వాళ్లకు పెళ్లయిందా లేదా, భర్త పొజిషన్ ఎలాంటిది అనే విషయం కూడా తెలిసిపోతుందట.
ఆఫ్రికా రాజకీయాల్లోనూ కేశాలంకరణది ప్రధాన పాత్రేనట. అందుకు హెర్బర్ట్ వింటర్, థామస్ బెల్లోస్ వంటివారి చరిత్ర ఉదాహరణగా నిలుస్తుంది. నిటారుగా ఉండే జుట్టు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుందట. అందుకే నల్లజాతి మహిళలు వివిధ రకాల కేశాలంకరణలతో ఉన్నతంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారట. అయితే ఈ విషయంలో తమ ప్రాచీన సంస్కృతిని నిలబెట్టుకోవాలా? ప్రస్తుత పరిస్థితిని అనుసరించాలా అన్న విషయంలో డైలమాలో పతున్నారు. తెల్లవారి కేశాలంకరణను అనుకరించడంలో, వారి ఆదర్శాలను వ్యతిరేకించడంలో అనిశ్చితికి గురౌతున్నారు.
వెస్ట్రన్ కల్చర్ ప్రభావం వారికి భారంగా మారుతోంది. నలుగురిలో మెలగాల్సిన పరిస్థితుల్లో ఆఫ్రికన్ మహిళలు హెయిర్ స్టైల్ మార్చాల్సిన పరిస్థితి వస్తోంది. తమ సంస్కృతిలో కొనసాగే వీలు కనిపించట్లేదు. తమ స్టైలును మూఢాచారంగానో, ఛాందసంగానో ట్రీట్ చేస్తారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అందుకే బలవంతంగా తలకట్టు మార్చాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
తమను తాము ప్రదర్శించుకోవడం కోసం, అనుకున్నది సాధించడం కోసం కూడా ఆఫ్రికన్ మహిళలు హెయిర్ స్టైల్ మారుస్తున్నారు. పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడం కోసం హెయిర్ స్టయిల్ ను పరిస్థితికి అనుగుణంగా మలచుకుంటున్నారు. కుటుంబం, రాజకీయం, ఉద్యోగం వంటి అనేక కారణాలతో ట్రెండ్ మారుస్తున్నారు. మహిళలు తమ వ్యక్తిగత ఛాయిస్ను తెలిపేందుకు చిహ్నంగా ఫైబర్ కలర్స్ను ఆశ్రయిస్తున్నారు.