
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో చేయి కోల్పోయిన విద్యుత్ శాఖ కాంట్రాక్టు కార్మికునికి కోర్టు ఆదేశాల మేరకు తాత్కాలిక ఉద్యోగమిచ్చిన టీఎస్‌ఎస్‌పీడీసీఎల్.. అతనికి రూ.5 వేలు వేతనం నిర్ణయించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రూ.5 వేలతో కుటుంబాన్ని పోషించడం ఎలా సాధ్యమవుతుందని సంస్థ అధికారులను ప్రశ్నించింది. ఆ కార్మికుడు సంస్థ కోసం పనిచేస్తూ చేయి కోల్పోయిన విషయం మర్చిపోవద్దని, కనీస వేతనమైనా ఇచ్చే విషయాన్ని మరోసారి పరిశీలించాలని ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌ల ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మానవతా దృక్పథంతో మన్నించండి
నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన పి.వెంకటేశ్వర్లు ఓ కాంట్రాక్టర్ కింద విద్యుత్ సంస్థలో కార్మికునిగా పనిచేస్తూ 2011లో విధి నిర్వహణలో జరిగిన ప్రమాదంలో కుడిచేతిని కోల్పోయారు. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని అధికారులను కోరినా స్పందించకపోవడంతో 2013లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్, వెంకటేశ్వర్లు మధ్య యజమాని, ఉద్యోగి సంబంధం లేనందున ఉద్యోగం ఇవ్వాలని ఆదేశాలివ్వలేమని 2016 జూలైలో తీర్పునిచ్చారు. ఆ తీర్పును సవాలు చేస్తూ ధర్మాసనం ముందు వెంకటేశ్వర్లు అప్పీల్ దాఖలు చేశారు.
అప్పీల్‌పై విచారణ జరిపిన జస్టిస్ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం.. వెంకటేశ్వర్లు విద్యుత్ సంస్థ కోసం పనిచేస్తూ ప్రమాదం బారిన పడ్డారని, మానవతా దృక్పథంతో అతని అభ్యర్థనను మన్నించాల్సిన బాధ్యత టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌పై ఉందని పేర్కొంది. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ ప్రకటించిన రూ.లక్ష నష్టపరిహారం తీసుకోవాలని వెంకటేశ్వర్లును ఆదేశించింది. అయితే ఉద్యోగం విషయంలో అధికారులు స్పందించకపోవడంతో వెంకటేశ్వర్లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, వెంకటేశ్వర్లును తాత్కాలిక ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్‌గా నియమించామని, నెలకు రూ.5 వేలు వేతనంగా నిర్ణయించామని చెప్పారు. వెంకటేశ్వర్లు తరఫు న్యాయవాది స్పందిస్తూ.. రూ.5 వేలతో బతకడం కష్టసాధ్యమన్నారు. ఆ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం, కనీస వేతనం విషయంలో పునరాలోచించాలని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment