- రైలు నుంచి జారిపడడంతో దుర్మరణం
- తాళ్లపూసపల్లి-మానుకోట రైల్వేస్టేషన్ల మధ్య ఘటన
- కన్నీరుమున్నీరైన మృతుడి తల్లి
మహబూబాబాద్ : రైలు నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి ఓ విద్యార్థి మృతిచెందిన సంఘటన మానుకోట-తాళ్లపూసపల్లి రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం జరిగింది. జీఆర్పీ ఎస్సై పి.దేవేందర్ కథనం ప్రకారం.. కేసముద్రం మండలం పెనుగొండ గ్రామానికి చెందిన తాటి ఉపేం దర్, శోభ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఉపేందర్ ఆటో నడుపుతుండగా, శోభ ఇంటి వద్ద బట్టల వ్యాపారం చేస్తోంది. వారి కుమారుడు నవీన్(18) ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ పరీక్ష రాసి కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు.
తల్లి శోభ బట్టల కోసం వరంగల్‌కు వెళ్తుండగా ఆమెకు తోడుగా కుమారుడు నవీన్ కూడా వెళ్లాడు. తిరుగుప్రయూణంలో వరంగల్ రైల్వేస్టేషన్‌లో పెద్దపల్లి ప్యాసింజర్ రైలు ఎక్కారు. తాళ్లపూసపల్లి రైల్వేస్టేషన్ దాటగానే వాంతికి రావడంతో డోర్ వద్దకు వెళ్లాడు. తల్లి పట్టుకుని ఉండగా ఆమె చేతుల్లో నుంచి జారి పట్టాలపై పడ్డాడు. దీంతో షాక్‌కు గురైన తల్లి తేరుకుని దిక్కుతోచని స్థితిలో ఏడుస్తుండగానే మానుకోట రైల్వే స్టేషన్ రాగా రైల్వే సిబ్బందికి సమాచారమిచ్చింది. వెంటనే 108కు ఫోన్‌చేసి నవీన్‌ను ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.
తలకు తీవ్ర గాయాలు కావడంతో మృతిచెందినట్లుగా రైల్వేపోలీసులు చెబుతున్నారు. నవీన్ మృతదేహాన్ని చూసి బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికొచ్చిన కొడుకు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణణాతీతంగా మారింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని రైల్వే పోలీసులు మృతుడి బంధువులకు అప్పగించారు.