
ప్రత్యేక హోదా ఇవ్వండి
మరో 10 తీర్మానాలకూ ఆమోదం
పోలవరం ఆర్డినెన్స్ తక్షణమే ఉపసంహరణ
అమరవీరులకు ఘన నివాళులు
సింగరేణి కార్మికులకూ పన్ను రాయితీ
బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు
మహిళలకూ అదనంగా 33 శాతం సీట్లు
కేంద్రంలో ప్రత్యేకంగా ఓబీసీ శాఖ ఏర్పాటు
వెంటనే రెండుగా హైకోర్టు విభజన
ఎవరెస్ట్ వీరులకు జేజేలు.. రూ. 25 లక్షల నజరానా
హిమాచల్ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి
టీవీ-9పై చర్యలకు చైర్మన్, స్పీకర్‌లకు అధికారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని ఉభయసభలూ ఏకగ్రీవంగా తీర్మానించాయి. దాంతోపాటు అమరవీరులకు సంతాపం తెలపడంతో పాటు మొత్తం పదకొండు తీర్మానాలను శనివారం ఏకగ్రీవంగా ఆమోదించాయి. సీమాంధ్రకు ఇచ్చే అన్ని రకాల ప్రయోజనాలను తెలంగాణకు కూడా ఇవ్వాలని అసెంబ్లీ డిమాండ్ చేసింది. తెలంగాణ కోసం అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించింది. తెలంగాణ శాసనసభను కించపరిచేలా కథనం ప్రసారం చేసిన టీవీ-9 చానల్‌పై కఠిన చర్యలు తీసుకునే అధికారాన్ని శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్‌లకు అప్పగిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పవేశపెట్టిన తీర్మానానికి కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, టీడీపీ, సీపీఎం, సీపీఐ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. పిన్న వయసులో ఎవరెస్టును అధిరోహించిన సాంఘిక గురుకుల విద్యార్థులను సభ అభినందించింది. వారికి భారీ నజరానా ప్రకటించింది. సీఎం ప్రవేశపెట్టిన అన్ని తీర్మానాలనూ పెద్దగా చర్చ లేకుండానే ఉభయసభలూ ఆమోదించాయి. అవి ఇలా ఉన్నాయి...
పోలవరం ఆర్డినెన్స్
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలి. అది రాజ్యాంగవిరుద్ధం. గిరిజనుల హక్కులు కాలరాయడమే. తెలంగాణ రాష్ట్ర అనుమతి లేకుండా సరిహద్దులు మార్చడం అన్యాయం. దీనివల్ల ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో గిరిజనులు జీవించే హక్కు కోల్పోతారు. 460 మెగావాట్ల సీలేరు విద్యుత్ ప్లాంటును తెలంగాణకే ఇవ్వాలి. ఆర్డినెన్స్ వల్ల రుద్రకోట ప్రాజెక్టు ప్రశ్నార్థకమైంది.
సింగరేణి కార్మికులకు పన్ను మినహాయింపు
బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కష్టపడుతున్న సింగరేణి కార్మికులకు సైన్యానికి ఇస్తున్న మాదిరిగానే పన్ను మినహాయింపు ఇవ్వాలి.
ప్రత్యేక హైకోర్టు
తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టును తక్షణమే ఏర్పాటు చేయాలి. వెంటనే అందుకవసరమైన చర్యలు చేపట్టాలి. తెలంగాణ ఉద్యమంలో అడ్వకేట్లు పోషించిన పాత్ర కీలకమైనది. తెలంగాణ న్యాయవాదులు, ప్రజలు తమ సొంత హైకోర్టు కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
ఓబీసీ మంత్రి ఉండాలి
దేశంలో 40 నుంచి 50 శాతం మేరకున్న ఓబీసీల కోసం కేంద్రంలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి నిధులివ్వాలి. నరేంద్ర మోడీ రూపంలో ఒక బీసీ వ్యక్తి తొలిసారి ప్రధానమంత్రి అయిన నేపథ్యంలో ఈ దిశగా చర్యలు తీసుకోవాలి.
మహిళలకు చట్టసభల్లో సీట్లు
చట్టసభల్లో 33 శాతం అదనపు సీట్లను ఏర్పరిచి వాటిని మహిళలకు రిజర్వ్ చేయాలి. మహిళల భాగస్వామ్యంతో దేశం అభివృద్ధి చెందుతుంది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు మేం కట్టుబడి ఉన్నాం. వారు జనాభాలో 50 శాతమున్నా చట్టసభల్లో మాత్రం ప్రస్తుతం కేవలం 10 శాతమే ఉన్నారు.
బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు
పార్లమెంట్‌లో, శాసనసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. చట్టసభల్లో వారికి సముచిత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరముంది గనుక ఈ మేరకు అవకాశం కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం.