ఆదిలాబాద్ అగ్రికల్చర్ : విద్యుత్ సరఫరాలో తరచూ హెచ్చుతగ్గులు అవుతుంటాయి. రైతులు కెపాసిటర్ అమర్చకపోవడంతో వ్యవసాయ పంపుసెట్లు తరచూ కాలిపోతున్నాయి. మరమ్మతులకు గురువుతాయి. బాగు చేసుకునేందుకు తడిసి మోపెడువుతుంది.
కెపాసిటర్‌ను అమర్చితే ట్రాన్స్‌ఫార్మర్, మోటార్ పని కాలాన్ని పెంచుకోవచ్చు. కాలిపోయే వాటికి అయ్యే ఖర్చును తగ్గించవచ్చని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ అశోక్ వివరించారు. జిల్లాలోని 52 మండలాల్లో 98 వేల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి 14,368 ట్రాన్స్‌ఫార్మర్లు ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతోంది. జిల్లాలో రోజుకు 20 నుంచి 25 ట్రాన్స్‌ఫార్మర్లు చెడిపోతున్నాయి. అధిక లోడువల్ల కొన్ని, మోటార్లకు కేపాసిటర్లు అమర్చక విద్యుత్ లోడు హెచ్చుతగ్గులు అయినప్పడు నియంత్రణ లేక ట్రాన్స్‌పార్మర్లు, మోటార్లు తరచూ చెడిపోతున్నాయి.
జిల్లాలో 80 శాతం మంది రైతులు విద్యుత్ మోటార్లకు కెపాసిటర్లు అమర్చకోక ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారు. ట్రాన్స్‌పార్మర్లు, మోటార్లు కాలిపోయి రోజులకొద్దీ పంటలకు నీరందక ఎండిపోయే పరిస్థితి ఎదురవుతోంది. ప్రసుత్తం రబీ సంటలు సాగు చేసుకుంటున్నారు. పంటలకు నీరందిచడం ముఖ్యం ఘట్టంగా చెప్పుకోవచ్చు విద్యుత్ మోటార్లు తరచూ కాలిపోకుండా రైతులు ముందు జాగ్రత్తగా కెపాసిటర్‌ను అమర్చుకుంటే విలువైన పంటలను రక్షించకోవచ్చు. ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చు. వ్యవసాయ మోటార్ల వినియోగంపై రైతులకు సూచనలు, సలహాలు అందించారు.
అవగాహన లేక..
మోటార్లకు కెపాసిటర్ అమర్చడం వల్ల లాభమెంత.. నష్టమెంత అనే విషయాలపై అవగాహన లేకపోవడంతో రైతులు విద్యుత్ మోటార్లకు కెపాసిటర్ అమర్చడం లేదు. రూ.150 నుంచి రూ.200 ఖర్చుతో అమర్చుకోవచ్చు. మోటారు కాలిపోయిన తర్వాత వందలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. కొంతమంది రైతులు మోటార్ ఆన్, ఆఫ్ స్విచ్‌ను బంద్ చేసిన తర్వాత మోటారుకు ఏదైనా మరమ్మతు చేసే సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో కెపాసిటర్‌ను తీసి వేస్తున్నారు.
మరమ్మతు చేసే సమయంలో న్యూట్రల్, ఫేస్ వైర్లను కలిపితే(షాట్ చేసి) ముట్టుకున్నట్లయితే ఎలాంటి షాక్ తగలదు. మోటార్లకు ఏదైనా మరమ్మతు వచ్చినప్పడు అవగాహన ఉన్న ఎలక్ట్రీషియన్‌తో మరమ్మతు చేయించుకోవడం ఉత్తమం. మోటారు వైండింగ్ కాలిపోయినప్పుడు మరమ్మతు చేసేవారు మోటారు వైండింగ్ వైర్ గేజ్ పెద్దవి, చిన్నవి అమరుస్తుండడంతో కెపాసిటర్ లేక కాలిపోతున్నాయి. కెపాసిటర్ బిగిస్తే విద్యుత్ హెచ్చుతగ్గుల నియంత్రణ వల్ల జరిగే నష్టాన్ని అరికట్టవచ్చు.
ఐఎస్‌ఐ మార్కు ఉన్నవే..
ఐఎస్‌ఐ మార్కు ఉన్న స్టార్టర్ వాడాలి. మూడు ఫ్యూజులు బిగించి ఐదు ఆంప్స్(సన్నవి) ఫ్యూజ్ వైరు మాత్రమే వినియోగించాలి. భూమి నుంచి మోటారుకు ఎర్త్‌వైరు(జీఐ వైరు) ఏర్పాటు చేయాలి. గొయ్యి తడిగా ఉండేలా చూడాలి. దీనివల్ల ప్యూజ్ సరిగా పని చేస్తుంది. సిఫారసు చేసిన సైజుల్లోనే సెక్షన్(నీరందించే) పైపులు బిగించాలి. సెక్షన్ పైపుకన్నా డెలివరీ పైపు సైజ్ పెద్దగా ఉండాలి. స్టార్టర్ ఉండే ట్రిప్ కాయిల్ తొలగించకూడదు.
తొలగిస్తే మోటారు కాలిపోయే ప్రమాదముంది. పంపు, మోటారుకు మధ్య ఉన్న ఫ్లాంజివాసర్లు, బోల్టులు సరిగా అమర్చాలి. స్టార్టర్ సరిగ్గా పనియేయడం వల్ల హైవోల్టేజీ వస్తే స్టార్టర్ అటోమేటిక్‌గా పడిపోయి మోటారు ఆగిపోతుంది. లేదా ప్యూజ్ మాత్ర మే మాడిపోయి మోటారుకు రక్షణ ఇస్తుంది. కెపాసిటర్ వల్ల విద్యుత్ ఓల్టేజీలో హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది. మోటారు హెచ్‌పీని బట్టి కెపాసిటర్‌ను అమర్చాలి. 3 హెచ్‌పీ మోటారుకు 1 కేవీఏఆర్ కెపాసిటర్, 5 హెచ్‌పీ మోటార్‌కు 2 కేవీఏఆర్, 7 హెచ్‌పీ మోటార్‌కు 3 కేవీఏఆర్ కెపాసిటర్ అమార్చాలి.
విద్యుత్ మోటార్లకు బీమా సౌకర్యం..
రైతులు ఉపయోగిస్తున్న విద్యుత్ మోటార్లు, పంపుసెట్లు, డీజిల్ ఇంజిన్లు, పంపు, స్టార్లర్లు, కెపాసిటర్ వంటి విడి భాగాలకు సైతం బీమా చేసుకునే అవ కాశం ప్రభుత్వం కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వ అజమాయిషీతో పనిచేస్తున్న ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ, నేషనల్ ఇన్స్యూరెన్స్ కం పెనీ వ్యవసాయ పంపుసెట్లు బీమా పథకం అమలు చేస్తున్నాయి. యాంత్రిక, విద్యుత్‌శక్తి లోపాలతో చెడిపోయిన, అగ్నిప్రమాదాలు, పిడుగుపాటు, దొంగతనం వంటి వాటిలో జరిగే నష్టాలకు కంపెనీ నుంచి బీమా పొందవచ్చు. పంపుసెట్ల సామర్థ్యం, ఎన్నాళ్లుగా వినియోగిస్తున్నరో చూసి మార్కెట్ విలువలను అనుసరించి ప్రీమియం, బీమా మొత్తం నిర్ణయిస్తారు.
కెపాసిటర్‌తో మోటార్ భద్రం
Published Tue, Nov 11 2014 2:50 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement