సాక్షి, శ్రీరాంపూర్(మంచిర్యాల) : ఎన్నికల్లో చెప్పినవన్ని అమలు చేస్తామని పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ తెలిపారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో అన్ని గనులపై ఆ యూనియన్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. గులాజీ రంగులు పూసుకొని నృత్యాలు చేస్తూ, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.
అన్ని గనులపై జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ మాటే శిలాశాసనమని, వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. నెలన్నర రోజుల్లో మారు పేరుతో పని చేసే వారందరికి పేర్లు క్లియర్ చేస్తూ జీవో ఇప్పిస్తామన్నారు. ఇళ్లు కట్టుకొనే కార్మికునికి రూ. 6 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ ఆసుపత్రిల్లో చికిత్స చేయించడం జరుగుతుందని తెలిపారు.
ఎన్నికల్లో గెలిచిన తరువాత టీబీజీకేఎస్ నేతలకు గర్వం రాదన్నారు. కడుపు, నోరు కట్టుకొని పని చేయాలన్నారు. గత తప్పిదాలు జరగకుండా పని చేయాలని పిలుపునిచ్చారు. ఫిట్ నుంచి డివిజన్, కేంద్ర స్థాయి వరకు నేతలను ఎంపిక చేయడం కార్మికుల అభిప్రాయం మేరకు సర్వేచేసి ఎన్నిక చేస్తామని ఎంపీ అన్నారు. ఏ ఒక్క నేత తప్పు చేసినా క్షమించమన్నారు.
టీబీజీకేఎస్ సంఘం పార్టీ అజమాయిషీలో నడుస్తుందని ఆయన చెప్పారు. అనంతరం మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్.దివాకర్‌రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి వెంకట్రావు మాట్లాడుతూ.. శ్రీరాంపూర్‌లో పెద్ద మెజారిటీతో గెలిపించినందుకు కార్మికులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే 4 ఏళ్లు కార్మికులకు మంచిగా సేవలు అందుతాయని అన్నారు. కార్మికులు కేసీఆర్‌పై విశ్వాసం ఉంచి ఈ విజయం సాధించి పెట్టారని వారు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment