కంటోన్మెంట్: పిల్లలే కానీ, పిడుగుల్లాంటి ప్రశ్నలు సంధించారు! తమ తరఫున పార్లమెంట్‌లో ప్రస్తావించిన ప్రశ్నలేంటో సూటిగా స్పష్టంగా వెల్లడించారు. విద్యార్థులుగా వారు ప్రత్యక్షంగా ఎదుర్కొనే సమస్యలతో పాటు, ప్రభుత్వ విధానాలతో తమ తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యల్నే ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘మీ ప్రశ్న నేను అడుగుతా’’ పేరిట మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి చేపట్టిన వినూత్న కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ‘‘మంచి ప్రశ్న అడగండి పార్లమెంట్ సందర్శనకు నాతో రండి’’ అంటూ మల్లారెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు.
ఈ మేరకు ఉత్తమ ప్రశ్నలు అడిగిన నలుగురు విద్యార్థులను వారి తల్లిదండ్రులతో సహా తన సొంత ఖర్చులతో పార్లమెంట్‌కు తీసుకెళ్తానని గతంలో ప్రకటించారు. తాజాగా ఈ కార్యక్రమానికి వచ్చిన స్పందనను చూసి ఏకంగా 37 మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులతో సహా పార్లమెంట్ సందర్శనకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ 36వేల మంది విద్యార్థులు స్పందించారని, వీరిలో సందర్భానుచితంగా, ఉత్తమంగా ప్రశ్నలు సంధించిన 37 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రస్తుత శీతాకాల సమావేశాలు ముగిసేలోపు, జనవరి మొదటి వారంలో తొలివిడతలో కనీసం 20 మంది విద్యార్థులతో కూడిన బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడంతో పాటు, వారు సూచించిన ప్రశ్నల్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తానని వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం బోయిన్‌పల్లిలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
337 ప్రశ్నలడిగా...
తాను ఎంపీగా ఎన్నికైన మూడున్నరేళ్ల కాలంలో ఇప్పటివరకు పార్లమెంట్లో 337 ప్రశ్నలు అడిగినట్లు ఎంపీ మల్లారెడ్డి వెల్లడించారు. వాటిలో మెజారిటీ సమస్యలు మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానం పరిధిలోని క్షేత్రస్థాయి సమస్యలే ఉన్నాయని తెలిపారు. తన పార్లమెంట్ సమావేశాల హాజరు 81 శాతం (రాష్ట్ర సగటు కంటే 11 శాతం అధికం) ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన ఎంపీ లాడ్స్ నుంచి రూ.23 కోట్లు వెచ్చించానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలుపుకుని పోతూ మల్కాజ్‌గిరిలో వేలాది కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.
ప్రశ్నలు/ సూచనలివే...
‘మీ ప్రశ్న నేను అడుగుతా’ కార్యక్రమంలో భాగంగా 37 మంది విద్యార్థులు పంపిన ప్రశ్నలను ఎంపిక చేశారు. వీటిలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు
⇔ బడిపిల్లలు పుస్తకాల బ్యాగు భారం అధికమవుతోంది, ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోబోయే కఠిన నిర్ణయాలేంటి?
⇔ దేశంలో ఒకటే పన్ను విధానంలో భాగంగా జీఎస్‌టీ మాదిరిగానే ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలన్నింటిని ఒకేతాటిపైకి తీసుకురావాలి. ఫిన్లాండ్ తరహా విద్యావిధానం ప్రవేశపెట్టేలా చూడాలి.
⇔ పాఠశాలల్లో క్రీడల ప్రాధాన్యం పెంచాలి, లైబ్రరీలను ఆధునీకరించేలా చూడండి.
⇔ నానాటికీ పెరుగుతున్న ధరల నియంత్రణకు చేపట్టేల చర్యలేవీ?
⇔ ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఆలోచనల్ని ప్రజలకు చేరువ చేయడానికి స్థానికంగా ప్రతి వార్డు కార్యాలయంలో అధికారిని అందుబాటులో ఉంచేలా చూడాలి
⇔ వస్తుసేవా పన్ను, జీఎస్‌టీని ఆసరా చేసుకుని కొందరు దుకాణదారులు సాధారణ ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు, వీరినెలా కట్టడి చేస్తారు?
⇔ పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర పన్నుల శాతం అధికంగా ఉంది, దీన్ని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావచ్చు కదా?
⇔ అగ్రవర్ణాల్లో నిరుపేదలకు రిజర్వేషన్‌లు కల్పించే అవకాశముందా?
⇔ ఆధార్– ఓటర్‌కార్డు అనుసంధానం చేసి, బోగస్ ఓట్లను ఎందుకు తొలగించడం లేదు? విద్య, వైద్య ఖర్చులకు ఆధార్‌ను అనుసంధానిచాలి.
Comments
Please login to add a commentAdd a comment