► కేంద్రానికి ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ వినతి
న్యూఢిల్లీ: ప్రైవేటు, ఇతర రంగాల్లో ఉద్యోగ విరమణ చేసిన వారికి కనీస పింఛన్ వసతి కల్పించాలని కేంద్రాన్ని ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ కోరారు. ఉద్యోగ విరమణ చేసిన ప్రైవేటు ఉద్యోగులకు పింఛన్, వైద్య సదుపాయాలు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాజ్యసభ జీరో అవర్‌లో బుధవారం ఆయన కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. తమకు కనీస పింఛన్ రూ. 3 వేలు ఇవ్వాలని 60 లక్షల మంది ఏళ్ల తరబడి ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. పింఛన్ లేని ప్రైవేటు, సెమీ గవర్నమెంట్, ఇతర రంగాల ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని, వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. రిటైర్డ్ ప్రైవేటు ఉద్యోగులకు వైద్య సదుపాయాలు కల్పిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి పార్లమెంట్ ఉభయసభల్లో చెబుతున్న నేపథ్యంలో వీరికి కనీస పింఛన్ నెలకు రూ. 3 వేలు ఇవ్వాలని ఆయన కోరారు.