సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సీతక్క
సాక్షి, మహబూబాబాద్(వరంగల్) : నిజాం కాలంలో నిర్బంధాన్ని చూసిన ప్రజలు అదే తీరును ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చూస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మహబూబాబాద్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కొత్తపోడు కొట్టేదిలేదని, పాతపోడును వదిలేది లేదని స్పష్టంచేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఎన్నికల తరువాత విస్మరించడం సరికాదన్నారు. హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 18న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కులో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అటవీశాఖ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి దాడులకు పాల్పడడం, కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. 20 నుంచి 30 సంవత్సరాల పాటు సాగులో ఉన్న భూములకు పట్టాలిచ్చి రైతు బంధును వర్తింప జేయాలని డిమాండ్ చేశారు. పోడు రైతులను అడవి విధ్వంసులుగా చిత్రీకరించడం బాధాకరమని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏడు వేల ఎకరాల్లో ఉన్న అటవీని నరికివేశారని, ఆ సమయంలో పర్యావరణ పరిరక్షణ గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అటవీ హక్కు చట్టం, పలు చట్టాలకు తూట్లు పొడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న బయ్యారం ఎఫ్‌ఆర్వోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు ఎంతో సక్రమంగా జరుగుతుండగా.. తెలంగాణలో మాత్రం ఆర్డినెన్స్ కోసం, తక్షణ అవసరాల కోసం మాత్రమే కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో జేసీ ఎం.డేవిడ్‌కు సీతక్క వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశంలో నాయకులు డాక్టర్ భూక్యా మురళీనాయక్, రామగోని రాజుగౌడ్, భద్రునాయక్, ఖలీల్, బానోతు ప్రసాద్, చుక్కల ఉదయ్‌చందర్, చీమల వెంకటేశ్వర్లు, వి.సారయ్య, ముసలయ్య, కత్తి స్వామి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment