ఇద్దరికి మించి సంతానమున్నా.. | Municipal Elections In Which More Than Two Offspring Are Eligible To Contest Wardsand Divisions | Sakshi
Sakshi News home page

ఇద్దరికి మించి సంతానమున్నా..

Published Thu, Dec 26 2019 3:10 AM | Last Updated on Thu, Dec 26 2019 9:13 AM

Municipal Elections In Which More Than Two Offspring Are Eligible To Contest Wardsand Divisions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చేనెలలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఇద్దరికి మించి సంతానమున్న వారు వార్డులు/డివిజన్లలో పోటీచేసేందుకు అర్హులే. ఈ మేరకు కొత్త పురచట్టంలోనూ అవసరమైన మేర మార్పులు చేశారు. ఈ చట్టాన్ని ఇదివరకే శాసనసభ/ శాసనమండలి ఆమోదించింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) కూడా స్పష్టతనిచ్చింది. ఇద్దరికి మించి పిల్లలుంటే మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధనను ఎత్తేయడంతో అభ్యర్థుల పోటీ విషయంలో ఈసారి కొత్త చట్టానికి అనుగుణంగా పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి.  

చెవిటి, మూగవారికి పోటీకి అవకాశం..
మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ, నిబంధనలు, ఏర్పాట్లకు సంబంధించి కొత్త మున్సిపల్‌ చట్టంలోని వివిధ సెక్షన్లు, కాలమ్‌ల వారీగా సరిచూసుకోవాలని ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు ఎస్‌ఈసీ సూచించింది. మున్సిపాలిటీల చట్టం, మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం, జీహెచ్‌ఎంసీ చట్టంలోని వివిధ అంశాలకు సంబంధించి పోటీచేసే అ«భ్యర్థులు, రిటరి్నంగ్‌ అధికారులు, ప్రిసైడింగ్‌ ఆఫీసర్లకు చట్టబద్ధమైన అంశాలపై స్పష్టతనిస్తూ మెటీరియల్‌ను రూపొందించింది.

చెవిటి, మూగ లేదా కుషు్టవ్యాధితో బాధపడుతుంటే అటువంటి వారు గతంలో పోటీకి అనర్హులుగా ఉండగా కొత్తచట్టంలో ఆ నిబంధనను తొలగించారు. అదేవిధంగా అవినీతి పద్ధతులు లేదా ఎన్నికల అక్రమాల కారణంగా (9ఏ చాప్టర్‌ ప్రకారం) శిక్షపడిన వారికి గతంలో పోటీకి అర్హత లేకపోగా, కొత్తచట్టంలో దానిని తొలగించారు. ఈ విషయాన్ని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు (జీహెచ్‌ఎంసీ మినహా), అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లు, కార్పొరేషన్ల ఆర్‌వోలు, పీవోలకు ఇదివరకే ఒక నోటిఫికేషన్‌ ద్వారా ఎస్‌ఈసీ తెలియజేసింది.

ఆ స్థలాలు పాడు చేస్తే జైలు శిక్ష, జరిమానా
మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీచేసే రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారం, ర్యాలీల నిర్వహణకు ఇకపై విద్యాసంస్థలు (ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ ఏవైనా), వాటి మైదానాలు ఉపయోగించే వీలు లేదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ప్రచార సమయంలో ప్రభుత్వ,ప్రైవేట్‌ స్థలాల గోడలపై పోస్టర్లు అంటించడం, ప్రకటనలు రాయడం, ఇతర చర్యలతో వికారంగా మారుస్తున్న నేపథ్యంలో ఈ ఆస్తుల యజమానులకు కలుగుతున్న నష్టం, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎస్‌ఈసీ కొన్ని అంశాల్లో మార్పులకు శ్రీకారం చుట్టింది.

‘ప్రివెన్షన్‌ ఆఫ్‌ డిస్‌ ఫిగర్మెంట్‌ ఆఫ్‌ ఓపెన్‌ప్లేసెస్, ప్రొహిబిషన్‌ ఆఫ్‌ అబ్సీన్, అబ్జెక్షనబుల్‌ పోస్టర్స్, అడ్వర్టయిజ్‌మెంట్‌ యాక్ట్, 1997 (యాక్ట్‌ 28 ఆఫ్‌ 1997)ను గతంలోనే ఉమ్మడి రాష్ట్రంలోని శాసనసభ ఆమోదించింది. దీని ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్‌ స్థలాన్ని పాడుచేస్తే దానిని నేరంగా పరిగణించడంతో పాటు మూడునెలల కారాగార శిక్ష లేదా రూ. వెయ్యికి తగ్గకుండా జరిమానా విధించవచ్చు. లేదా ఈ జరిమానాను రూ.2 వేలకు పెంచడంతో పాటు రెండుశిక్షలు విధించవచ్చు. ఈచట్టంలోని సెక్షన్ల ప్రకారం అభ్యంతరకరమైన ప్రచార ప్రకటనలను తొలగించే, చెరిపేసే అధికారం పోలీసులకు కల్పించారు.

ఇవి కూడా..
►గోడలమీద పోస్టర్లు, కాగితాలు అంటించడంలేదా మరోరూపంలోనైనా పాడుచేయడం, కటౌట్లు, హోర్డింగ్‌లు, బ్యానర్లు, జెండా లు, మొదలైనవాటిని ప్రభుత్వ స్థలాల్లో (ప్రజల ఆస్తులతోసహా) అనుమతించరు. ప్రభుత్వ కార్యాలయం లేదా ప్రాంగణం ప్రభుత్వ స్థలం పరిధిలోకి వస్తాయి.
►ఒకవేళ ఏ బహిరంగస్థలంలో (ప్రభుత్వ స్థలం కానిది) నిర్దేశిత రుసుముల చెల్లింపు ద్వారా లేదా మరో విధంగా నినాదాలు రాసుకోడానికి, పోస్టర్లు మొదలైన వాటి ప్రదర్శనకు, కటౌట్లు, హోర్డింగ్‌లు, బ్యానర్లు రాజకీయ ప్రకటనలు మొదలైన వాటికి అనుమతి లేదా అవకాశం కలి్పంచిన చోట అన్ని పార్టీలకు, అభ్యర్థులకు సమాన అవకాశం కలి్పంచాల్సి ఉంటుంది.
►గోడలపై రాసే నినాదాలు, రాతలు, ప్రదర్శనలు వివిధ వర్గాల్లో అసహనాన్ని, అసంతృప్తిని కలిగించేలా ఉండకూడదు
►వాణిజ్య వాహనాలను సంబంధిత మున్సిపల్‌ కమిషనర్ల అనుమతి పొందాకే ప్రచారానికి ఉపయోగించాలి. ఈ ఆమోదం పొందాకే ఆయా వాహనాలపై జెండాలు, స్టిక్కర్లు, మొదలైన వాటి ప్రదర్శనకు అనుమతి ఉంటుంది.
►మార్పులు చేసిన ప్రచార, వీడియో రథం వంటి ప్రత్యేక ప్రచార వాహనాలకు ఎంవీ చట్టం కింద అధికార పరిధి ఉన్న వారి నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాకే ఉపయోగించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement