
మున్సిపల్ పొత్తుకు బీజేపీ, టీడీపీ యత్నం
భువనగిరి, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బతిన్న టీడీపీ, బీజేపీ కూటమి జిల్లాలోని భువనగిరి, సూర్యాపేట మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటయ్యే మున్సిపల్ పాలకవర్గాల్లో పాగా వేయాలని రెండు పార్టీలూ కసరత్తు ప్రారంభించాయి. ఇందుకోసం బీజేపీ నుంచి ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్, టీడీపీ నుంచి తొర్రూర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. వీరిద్దరు స్థానిక కౌన్సిలర్లను సమన్వయం చేసి రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడానికి ప్రణాళికను రూపొందిస్తున్నారు.
భువనగిరి మున్సిపాలిటీలో ఉన్న 30 వార్డులో బీజేపీ8, టీడీపీ7, కాంగ్రెస్ 8, ఇండిపెండ్లెంటు ్ల6, సీపీఎం ఒకచోట గెలిచాయి, ఇందులో బీజేపీ, టీడీ పీలకున్న 15మందికి మరొకరు మద్దతు ఇస్తే ఈ కూటమి అధికారంలోకి వస్తుంది. అయితే ఐదేళ్ల పదవి కాలాన్ని చెరి సగం పంచుకునేందుకు రెండు పార్టీల నాయకులు సిద్ధంగా ఉన్నారు. అయితే ఎవరు ముందుగా పదవిని దక్కించుకోవాలన్న దానిపై సందిగ్దత నెలకొంది.
టీడీ పీ, బీజేపీలు రెండూ ముందుగా పదవిని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నాయి. ఇక సూర్యాపేట మున్సిపాలిటీలో 34వార్డులున్నాయి. ఇక్కడ టీడీపీ, సీపీఎం కూటమికి 14, బీజేపీకి 4 వచ్చాయి. దీంతో మూడు పార్టీలు కలిస్తే ఇక్కడ అధికారం చేజిక్కించుకోవడం ఖాయం. ఒకచోట మేము, మరో చోట మీరు అన్నట్లు చెరో మున్సిపల్ స్థానాన్ని దక్కించుకోవడానికి బీజేపీ, టీడీపీలు పావులు కదుపుతున్నాయి. అయితే రెండుచోట్ల స్థానిక కౌన్సిలర్లను సమన్వయం చేసి మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని రెండు పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
భువనగిరి, సూర్యాపేటల్లోని టీడీపీ, బీజేపీ స్థానిక పెద్ద నాయకులతో చర్చలు జరుపుతూ కౌన్సిలర్లను ఒప్పించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. భువనగిరిలో ముందుగా తామే చైర్మన్ పదవిని చేపడతామని టీడీపీ కౌన్సిలర్లు పట్టుబడుతున్నట్లు సమాచారం.తమకు ఏడుగురు కౌన్సిలర్లు ఉన్నారని, మరొకరి మద్దతు కూడగడ తామని దీంతో ముందుగా తమకే అవకాశం ఇవ్వాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జాతీయ, రాష్ర్ట స్థాయిలో పొత్తులు కుదుర్చుకున్న బీజేపీ, టీడీపీలు స్థానికంగా అదే పద్ధతిలో ముందుకు సాగాలని నాయకత్వం కోరుకుంటుంది. దీనికోసం రెండు పార్టీ ఉన్నతస్థాయి నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.