విఠల్‌రావుకు కన్నీటి వీడ్కోలు
* ప్రభుత్వం తరపున రమణాచారి నివాళులు
* ప్రభుత్వ అవార్డు, నగదు అందజేత
హైదరాబాద్: గజల్ గానగంధర్వుడు విఠల్‌రావును కడసారి చూసేందుకు ఆయన శిష్యులు, అభిమానులు హైదరాబాద్‌లోని గోషామహల్‌కు చేరుకుని నివాళులు అర్పించారు. శనివారం అశ్రునయనాల మధ్య ఆయన నివాసం నుంచి ఆయన అంతిమయాత్ర పురానాపూల్‌లోని శ్మశానవాటిక వరకు సాగింది. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.
అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ సలహా దారు కేవీ రమణాచారి విఠల్‌రావు భౌతికకాయానికి నివాళులు అర్పించి, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటీవల రాష్ట్ర అవతరణ దినోత్సవం సం దర్భంగా ప్రభుత్వం ప్రకటించిన అవార్డు, రూ.1,16,000 నగదును ఆయన భార్య తారాబాయికి అందజేశారు. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ దేశ విదేశాలలో ప్రఖ్యాత గాయకుడిగా పేరు ప్రఖ్యాతలు అందుకున్న విఠల్‌రావు అకాల మరణం రాష్ట్రానికి తీరనిలోటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన ప్రతిభను గుర్తించి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అవార్డు, నగదుతో సత్కరించాలనుకుందన్నారు. అయితే ఆ రోజు కార్యక్రమానికి ఆయ న రాలేదని, కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పుడు వాటిని అందజేసినట్లు వివరించారు.
కన్నీటి వీడ్కోలు...
నిజాం కాలం నుంచి గోషామహల్‌లో నివాసముంటూ.. కొద్ది రోజు లుగా అదృశ్యమై అకాల మరణం చెందిన విఠల్‌రావు పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం శని వారం ఉదయం ఆయన నివాసానికి తీసుకువచ్చారు. ఆయన అభిమానులు తండోపతండాలుగా చేరుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. మధ్యాహ్నం 2గంటలకు అంతిమయాత్ర ఆయన నివాసం నుంచి బయలు దేరి శిష్యులు, అభిమానుల అశ్రునయనాల మధ్య యాత్ర మధ్యాహ్నం 3 గంటలకు పురానాపూల్ శ్మశానవాటికకు చేరుకుంది. అక్కడ పండిట్ విఠల్‌రావుకు వేలాది మంది కన్నీటి వీడ్కోలు పలికారు.