
జయలలితకు పట్టిన గతే కేసీఆర్‌కూ..!
తమిళనాడులో జయలలితకు పట్టిన గతే తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికీ పడుతుందని విమర్శించారు.
- నాగం తీవ్ర విమర్శలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీలను ఉద్దేశించి బీజేపీ సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం టీఆర్‌ఎస్‌లో అలజడి పెరిగిందని, కనీసం వచ్చే 20 నెలలపాటైనా ప్రభుత్వాన్ని కాపాడుకుంటే గొప్పేనన్నారు.
ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన నాగం.. తమిళనాడులో జయలలితకు పట్టిన గతే కేసీఆర్ కుటుంబానికీ పడుతుందని అన్నారు.
'తెలంగాణలో వచ్చే 20 ఏళ్లూ టీఆర్‌ఎస్‌దే అధికారం' అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను ప్రస్తావించిన నాగం.. 20 ఏళ్లుకాదు..20 నెలలు ప్రభుత్వాన్ని కాపాడుకుంటే మహా ఎక్కువ అని వ్యాఖ్యానించారు. 'సెక్రటేరియట్‌లో అడుగు పెట్టకుండా, అపరిష్కృతంగా పేరుకుపోయిన ఫైళ్లను చూసి మీకు 20 ఏళ్లు అధికారం ఇవ్వాలా?' అని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ అవినీతిపై బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి లేవనెత్తిన అంశాలను మాట్లాడే దమ్ముందా? అని సవాలు చేశారు.
'ఆంధ్ర కాంట్రాక్టర్లను తరిమేయాలన్న కేసీఆర్, ప్రస్తుతం పర్సంటేజీల కోసం అదే ఆంధ్ర కాంట్రాక్టర్లకే కాంట్రాక్టులు కట్టబెట్టిన సంగతి ప్రజలకు తెలియదా? బినామీ ఆస్తులు కూడబెడ్తున్న కేసీఆర్ కుటుంబానికి.. జయలలితకు పట్టిన గతే పడుతుంది. రైతులను పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం పేక మేడలా కుప్పకూలడం ఖాయం. చెరువుల్లో పూడిక తీసిన మట్టిని టీఆర్‌ఎస్ కార్యకర్తలు అమ్ముకుంటున్నారు' అని నాగం ధ్వజమెత్తారు. అవినీతితో ఎంత డబ్బు సంపాదించినా 2019లో గెలుపు మాత్రం బీజేపీదేనని ఆశాభావం వ్యక్తం చేశారు.