నాగార్జునసాగర్ ప్రాజెక్టులో అంతర్భాగమైన సహకార ఎత్తిపోతల పథకాల ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో అంతర్భాగమైన సహకార ఎత్తిపోతల పథకాల ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్లు, అధికారుల ఇష్టారాజ్యం వల్ల గత ఏడాది పనులు ప్రారంభమైనా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. కొన్ని ఎత్తిపోతల పథకాల్లో ఇటీవలనే పనులు ప్రారంభించారు. కాగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు ఎత్తిపోతల పథకాలకు నీటిని అందించే అవకాశం లేదు. గత ఏడాది క్రాప్ హాలిడే ప్రకటించిన అధికారులు గత ఖరీఫ్, రబీ సీజన్‌లకు నీటిని విడుదల చేయలేదు.
మిర్యాలగూడ : దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో కాలువ చివరి భూములకు సాగునీటిని అందించడానికి గాను ప్రపంచ బ్యాంకు సహకారంతో రూ.4444.41 కోట్లు వెచ్చించి నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధునికీకరణ పనులు చేపడుతున్న విషయం విదితమే. కాగా అందులో భాగంగానే జిల్లాలోని ఎడమ కాలువపై ఉన్న 40 ఎత్తిపోతల పథకాలను కూడా ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. నీటి పారుదల అభివృద్ధి శాఖ, ప్రపంచ బ్యాంకు బృందం సంయుక్తంగా ఎత్తిపోతల పథకాలను సందర్శించి సర్వే నిర్వహించి జిల్లాలోని 40 ఎత్తిపోతల పథకాల్లో ఎల్- 27 మినహా మిగతా 39 ఎత్తిపోతల పథకాలకు గాను రూ. 91.50 కోట్లు కేటాయించారు. ఆధునికీకరణ పనులు వేగవంతంగా చేపట్టడానికి గాను ఎత్తిపోతల పథకాలను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు.
నీటి విడుదల అనుమానమే?
లిఫ్టుల ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా పనులు మాత్రం ఇటీవలనే ప్రారంభించారు. ఇప్పటి వరకు జిల్లాలో గరిడేపల్లి మండలంలోని అగ్రహారం వద్ద ఉన్న ఎల్ -28 ఎత్తిపోతల పథకం, నేరేడుచర్ల మండలంలోని ఆర్- 8 ఎత్తిపోతల పథకం పూర్తి కాగా మరో నాలుగు ఎత్తిపోతల పథకాల్లో 90 శాతం పనులు పూర్తయ్యాయి. నాలుగవ ప్యాకేజీలో ఉన్న ఎల్ 18-19, 20, 21, 22-23, 24, 25-26 ఎత్తిపోతల పథకాలకు ఆలస్యంగా టెండర్లు పిలవడంతో ఇంకా పనులు ప్రారంభించలేదు. మొదటి, రెండు, మూడు ప్యాకేజీలలో ఉన్న ఎత్తిపోతల పథకాలలో పనులు కూడా ఇటీవలనే ప్రారంభించారు.
వేములపల్లి మండల కేంద్రంలోని ఎల్ - 14వ ఎత్తిపోతల పథకంలో పైప్‌లైన్ల నిర్మాణం కొనసాగుతోంది. ఇప్పటి వరకు రెండు మోటార్లు బిగించగా మిగతా రెండు మోటార్లు బిగించాల్సి ఉంది. ఎల్ -13 ఎత్తిపోతల పథకంలో ఇటీవల పనులు ప్రారంభించారు. మోటార్లు పూర్తిగా తొలగించారు. ఖరీఫ్‌లో ఈ ఎత్తిపోతల పథకం కింద పూర్తిగా క్రాప్ హాలిడే ప్రకటిస్తే తప్ప పనులు పూర్తయ్యే అవకాశాలు లేవు. శెట్టిపాలెం సమీపంలో ఉన్న ఎల్- 15, 17 ఎత్తిపోతల పథకాల్లో మోటార్లు బిగించాల్సి ఉంది. ఎత్తిపోతల పథకాలన్నింటిలో పైప్‌లైన్ల పనులు ఎక్కడా పూర్తి కాలేదు. పనులు నత్తనడక సాగుతుండటం వల్ల ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్‌లలో సాగునీటిని విడుదల చేసే అవకాశాలు లేవు.
పనులు ఆలస్యంగా ప్రారంభించారు
ఎత్తిపోతల పథకాల కింద ఆధునికీకరణ పనులు ఆలస్యంగా ప్రారంభించారు. దీని వల్ల పనులు పూర్తయ్యే అవకాశం లేదు. ఖరీఫ్ సీజన్‌లో పంటలకు నీటిని విడుదల చేసే అవకాశాలు లేవు. ఆధునికీకరణ పనులు వేసవిలో చేయాల్సి ఉన్నా అధికారులు, కాంట్రాక్టర్ల అశ్రద్ధ వల్ల ఆలస్యంగా చేపట్టడంతో రైతులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా పనులు వేగవంతంగా చేయాలి.
- మాలి నర్సిరెడ్డి, వేములపల్లి
సబ్ కాంట్రాక్టర్ల వల్ల పనులు ఆలస్యం
పనులను అధికారులు పర్యవేక్షించడం లేదు. సబ్ కాంట్రాక్టర్లు చేయడం వల్ల ఆలస్యంగా సాగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 40 ఎత్తిపోతల పథకాలకు రూ.91 కోట్లు కేటాయించడం వల్ల నిధులు సరిపోవడం లేదు. మరో 100 కోట్ల రూపాయలు కేటాయిస్తేనే పూర్తి స్థాయిలో ఆధునికీకరణ జరుగుతుంది. కాలువల మరమ్మతులు కూడా చేయాలి, కేవలం మోటార్లు, పైప్‌లైన్‌లు మాత్రమే మార్చుతున్నారు. పనులు వేగవంతంగా చేయాలి.
- పాదూరి శశిధర్‌రెడ్డి, ఎత్తిపోతల
రెతు సంఘం అధ్యక్షుడు